Begin typing your search above and press return to search.

త‌గ్గేదేలే.. కేసీఆర్‌పై మ‌రోసారి త‌మిళి సై!

By:  Tupaki Desk   |   25 July 2022 8:03 AM GMT
త‌గ్గేదేలే.. కేసీఆర్‌పై మ‌రోసారి త‌మిళి సై!
X
తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీని చేయాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం కోర‌డం.. ఇందుకు ఆమె తిర‌స్క‌రించడం జరిగిపోయాయి. అప్ప‌టి నుంచి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌ను ల‌క్ష్యంగా చేసుకుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో నూత‌న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం కోసం త‌మిళిసై ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ‌లో వ‌ర‌ద‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నిధులకు సంబంధించిన వివరాలు నాకు ఇచ్చారు. నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. నైతిక బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. ఈ క్రమంలోనే వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించాను అంటూ కేసీఆర్ ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్యాఖ్య‌లు చేశారు.

అలాగే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని త‌మిళిసై స్ప‌ష్టం చేశారు. రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌ కలిసిన తర్వాత కూడా త‌న‌ ప్రొటోకాల్‌లో మార్పురాలేద‌న్నారు. గోదావ‌రి వరద ప్ర‌భావిత ప్రాంతాల్లో తాను ప‌ర్య‌టిస్తే కలెక్టర్‌ కూడా రాలేద‌ని గుర్తు చేశారు.

కేసీఆర్, త‌న మ‌ధ్య సంబంధాల్లో ‘స్టేట‌స్ కో (య‌థాత‌థ స్థితి) నే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో తాను పోల్చుకోన‌ని.. గవర్నర్‌ను కాబట్టి రాజ్‌భవన్‌కే పరిమితం కావాల‌ని అనుకోనిని త‌మిళి సై వెల్ల‌డించారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే త‌న ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. త‌నకు తోచిన రీతిలో ప్ర‌జ‌లకు సాయం అందిస్తాన‌న్నారు.

త‌మిళిసై ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చేసిన తాజా వ్యాఖ్య‌ల‌తో టీఆర్ఎస్ నేత‌లు ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్.. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను ఎలా తీసుకుంటారు? ఆమెపై ఎలా స్పందిస్తార‌నేది వేచిచూడాల్సిందేన‌ని అంటున్నారు.