Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ చేయాల్సిన పని చేస్తున్న తమిళ సై

By:  Tupaki Desk   |   11 Nov 2019 1:19 PM GMT
సీఎం కేసీఆర్ చేయాల్సిన పని చేస్తున్న తమిళ సై
X
అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగటమే కాదు.. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తారు. అంతకు మించిన అధికార యంత్రాంగం పనులు ఏ విధంగా చేస్తుందన్న విషయాన్ని సమీక్షిస్తూ.. పరుగులు తీయిస్తారు. కానీ.. తెలంగాణలో ఇందుకు భిన్నమైన సీన్ నడుస్తోంది.

ఎక్కడిదాకానో ఎందుకు? ఈ రోజు (సోమవారం) ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్ ట్రైన్.. ఆగి ఉన్న హందీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఢీ కొట్టిన వైనం తెలిసిందే. ఈ షాకింగ్ ప్రమాదంలో దాదాపు 15 మంది వరకూ గాయపడగా.. ఒకరిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటివేళ.. సాధారణంగా సీఎం రంగంలోకి దిగుతారు. ఆసుపత్రిలోని బాధితులకు సహాయ సహకారాలు అందించటంతో పాటు.. మెరుగైన వైద్యం అందుతుందా? లేదా? అన్నది వాకబు చేస్తారు.

వీలైతే.. పరామర్శకు వెళతారు. అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో సీఎం కేసీఆర్ నుంచి స్పందన ఎలా ఉన్నా.. గవర్నర్ తమిళ సై ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఫోన్ చేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

ఇదంతా చూసినప్పుడు.. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన పనుల్ని తెలంగాణ గవర్నర్ తమిళ సై చేయటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న అధినేత ఇలాంటి విషయాల్లో యాక్టివ్ గా ఉండాల్సినప్పటికీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో.. తమిళసై మరింత యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారశైలిని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.