Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు బీపీ పెంచే ఇంకో ప‌ని చేసిన త‌మిళిసై

By:  Tupaki Desk   |   22 April 2022 2:29 AM GMT
కేసీఆర్‌కు బీపీ పెంచే ఇంకో ప‌ని చేసిన త‌మిళిసై
X
''ప‌రిపాల‌కులు, వారి ఆదేశాల‌ను పాటించే అధికారులు స‌రైన విధంగా వ్య‌వ‌హ‌రిస్తే సామాన్య ప్ర‌జ‌లు నా ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌స్తారు? స‌మ‌స్య‌లు నా దృష్టికి వ‌చ్చి ప‌రిష్క‌రించాల్సిన ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డుతుంది?'' గ‌త కొద్దికాలంగా హాట్ టాపిక్‌గా మారిన తెలంగాణ‌లోని ప‌రిణామాల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రియాక్ష‌న్ ఇది. తెలంగాణ‌లోని ప‌రిపాల‌న‌పై, వివిధ ప‌రిణామాల‌పై త‌న వైఖ‌రిని ఇలా బ‌హిరంగంగానే కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లు వెల్ల‌డించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్ర‌భుత్వానికి బీపీ పెంచే మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణలో మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ రాష్ట్రంలోని వివిధ అంశాల‌పై దూకుడుగా వెళ్ల‌నున్నార‌నే విష‌యాన్ని క్లారిటీ ఇచ్చేశారు.

తెలంగాణ‌లో భారీ స్థాయిలో మెడిక‌ల్ పీజీ సీట్ల బాగోతం బ‌య‌ట‌ప‌డింది. మెడికల్ పీజీ భర్తీ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ద్వారా జరుగుతుండ‌గా పరీక్షలో ర్యాంకు సాధించిన వాళ్ళే పెట్టుబడిగా పీజీ సీట్ బ్లాక్ దందా జ‌రుగుతోంది. పీజీ కోర్సుల‌లో చి ర్యాంక్‌ సాధించిన వాళ్ళు దేశవ్యాప్తంగా జరిగే కౌన్సిలింగ్‌లో వారి ర్యాంక్‌ ఆధారంగా ఫ్రీ సీటు పొందుతారు.

ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో జరిగే మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ఒక్కసారి కాకుండా.. ఆయా రాష్ట్రాలు వాళ్లకు అనుకూలంగా ఉన్న తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. అయితే మంచి ర్యాంక్ సాధించి ఫ్రీ సీట్లు పొందిన వ్యక్తులు.. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే బి కేటగిరి కౌన్సిలింగ్‌కు హాజరవుతారు. మంచి ర్యాంక్‌ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్లకు సీట్ వస్తుంది. కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు తమ కాలేజీల్లో ఫీజులు కట్టినట్లు కూడా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిర్ధారిస్తాయి.

రెండు మూడు దఫాలుగా నడిచే టాప్ అప్ కౌన్సెలింగ్ రౌండ్లు కూడా పూర్తి అయ్యే వరకు కాలేజీలు సైలెంట్‌గా ఉంటాయి. ఇక ఎలాంటి కౌన్సెలింగ్ లేదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత సదరు కాలేజీల యాజమాన్యాలు తమ దగ్గర బి కేటగిరీలో డబ్బులు కట్టిన విద్యార్థులు జాయిన్ కావడం లేదనే సమాచారం యూనివర్సిటీకి చేరవేస్తారు.

నిబంధనల ప్రకారం ఇలా ఖాళీగా మిగిలిన సీట్లు నింపుకునే స్వేచ్ఛ తమకు ఉంది కాబట్టి.. ఆ మిగిలిన సీట్లను నింపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం అనుమతి పొందడం జరిగిపోతాయి. అయితే, ఈ ఎపిసోడ్‌లోనే పెద్ద స్కాం జ‌రిగింది.

ప్రైవేట్ మెడిక‌ల్ పీజీ సీట్లలో బ్రాంచీలకున్న క్రేజ్‌ని బట్టి 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలకు మెడిక‌ల్ కాలేజీల బాధ్యులు అమ్మేసుకుంటున్నారు. మెడికల్ పీజీ కాలేజీల్లో జ‌రుగుతున్న‌ సీట్ల బ్లాక్ బాగోతాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది.

దీనిపై గ‌వ‌ర్న‌ర్ స్పందిస్తూ నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను కోరారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని.. కాళోజీ వర్సిటీ వీసీని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు. దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే, స‌హ‌జంగానే గవ‌ర్న‌ర్ దూకుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.