Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీతో భేటీ తర్వాత తమిళ సై సంచలనం

By:  Tupaki Desk   |   6 April 2022 11:08 AM GMT
ప్రధాని మోడీతో భేటీ తర్వాత తమిళ సై సంచలనం
X
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ఓపెన్ అయ్యారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు ప్రస్తావించని అంశాలపైనా ఆమె క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును.. ఆయన ప్రభుత్వ వైఖరిని ఆమె దుమ్ము దులిపేసినట్లుగా తప్పుల చిట్టా విప్పారు. గడిచిన కొంతకాలంగా తనకు ఎదురవుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై మనస్తాపంతో ఉన్న ఆమె తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదికల్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. తాను కంప్లైంట్లు ఇవ్వటానికి ప్రధాని మోడీని కలవలేదన్న ఆమె.. కేసీఆర్ సర్కారు తనను అవమానించిన తీరుపై ఆమె ఎంత ఆగ్రహంతో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. తాను పేచీలు పెట్టుకునే వ్యక్తిని కాదని.. అందరితో స్నేహపూర్వకంగా ఉంటానని చెబుతూనే.. అందుకు తగ్గ ఉదాహరణలు చెప్పటం ద్వారా ఆమె మాటలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయన్నది ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని.. తనను అవమానించినా ఫర్లేదు కానీ తన పదవిని అవమానించటం సరికాదన్నారు. గవర్నర్ కు ఇవ్వాల్సినంత ప్రోటోకాల్ ఇవ్వటం లేదని.. వ్యక్తిగతంగా తనను అవమానిస్తే భరిస్తాను కానీ.. రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని తాను అభినందించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. చేయాల్సిన పనులు ఉంటే వాటికి సూచనలు చేశానన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలన్న ఆమె వరంగల్ ఆస్పత్రిలో వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తానెప్పుడూ రాజకీయాలు చేయలేదని.. ఒకవేళ ఏదైనా విషయంలో తాను రాజకీయం చేసి ఉంటే.. ఆ విషయాన్ని బయటపెట్టాలన్నారు. ముఖ్యమంత్రి ఏ విషయంపైనైనా సరే నేరుగా వచ్చి చర్చించొచ్చన్నఆమె.. గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలన్నది తనకున్న విచక్షణాధికారమన్నారు. కౌశిక్ రెడ్డి పేరుపై తాను సంతృప్తి చెందలేదన్న ఆమె.. గతంలో ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గరు పేర్లను ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. తనను కాకున్నా గవర్నర్ ను.. గవర్నర్ పదవిని కార్యాలయాన్ని గౌరవించాలి కదా? అని ప్రశ్నించారు.

"రాష్ట్ర ప్రభుత్వానికి..గవర్నర్ కార్యాలయానికి మధ్య పెరిగిన గ్యాప్ గురించి మీకు అందరికీ తెలుసు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. అందరితో స్నేహంగా ఉంటాను. నేను చాలా పారదర్శకంగా ఉంటాను. నేను ప్రజలతో.. ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటా. ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో వారికే తెలియాలి. కేంద్రం చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కృతజ్ఞతలు తెలియజేసా. పుదుచ్చేరి - తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరా. ట్రైబల్ గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అంశాల గురించి మాట్లాడాను. అయినా సరే, నేను వేటినీ పట్టించుకోవడం లేదు. నేనేమీ వివాదం చేయటం లేదు. చర్చకు సిద్ధంగా ఉన్నాను. కౌశిక్ రెడ్డి సాకు చూపించి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించటం సరికాదు" అని వివరించారు.

ప్రోటోకాల్ ప్రకారం హాజరు కావాల్సిన అధికారులు హాజరు కాకపోవటాన్ని ప్రస్తావించిన గవర్నర్ తమిళ సై.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకుండా ప్రోటోకాల్ అమలు చేయకుండా ఉండటం సరైన పద్దతా? అని ప్రశ్నించిన తమిళ సై.. "ఇలాంటి ఘటనలు జరగకూడదు. గవర్నర్ గా ఎవరున్నా సరే.. ఆ పదవిని గౌరవించాలి. నేను చాలా సానుకూలంగా ఉండే వ్యక్తిని. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ తరహా ఉల్లాఘనలు సరైనవో కావో అన్నది"అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పని తీరుపై రిపోర్టు కార్డు ఇవ్వటం తన పని కాదన్న ఆమె.. తన విషయంలో కేసీఆర్ సర్కార్ వ్యవహరించిన తీరును తీవ్ర స్థాయిలో తప్పు పట్టటం గమనార్హం. మరి.. గవర్నర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి.