Begin typing your search above and press return to search.

తమి‌ళ రాజ‌కీయంః ముఖం శశికళది.. ఓటు బీజేపీదా..?

By:  Tupaki Desk   |   3 March 2021 8:30 AM GMT
తమి‌ళ రాజ‌కీయంః ముఖం శశికళది.. ఓటు బీజేపీదా..?
X
అవినీతి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభ‌వించిన శ‌శిక‌ళ‌.. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందే విడుద‌ల‌య్యారు. ఈ ప‌రిణామం వెనుక క‌షాయ నేత‌లు ఉన్నార‌నే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఈమెతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా త‌మిళ‌నాడులో పాగా వేయాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. క‌ష్ట‌సాధ్య‌మైన ఈ టాస్క్ ను రీచ్ కావ‌డానికి ఉన్న అవ‌కాశాల‌న్నీ వాడేస్తోంది క‌మ‌ల‌ద‌ళం.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణ త‌ర్వాత‌.. అన్నాడీఎంకేను అన్ అఫీషియ‌ల్ గా బీజేపీ గైడ్ చేస్తోంద‌నే అభిప్రాయం త‌మిళ‌నాట‌ బాహాటంగానే వినిపిస్తోంది. ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి స‌హా.. శ‌శిక‌ళ వ్య‌తిరేకంగా వ‌ర్గంగా ఉన్న‌వారంతా ఢిల్లీ సూచ‌న‌ల మేర‌కే అడుగులు వేస్తున్నార‌ని త‌మిళులు న‌మ్ముతున్నారు. ఈ అభిప్రాయం కొన‌సాగితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావిస్తున్న కాషాయ హైక‌మాండ్.. మ‌రోవైపు నుంచి న‌రుక్కు రావాల‌ని చూస్తోంద‌ట‌.

జ‌య త‌ర్వాత అన్నాడీఎంకే త‌న‌దేనంటూ హ‌డావిడి చేసిన శ‌శిక‌ళ‌ను వెంట‌నే అక్ర‌మాస్తుల కేసు దాడిచేసింది. ప‌ళ‌నిస్వామి వ‌ర్గం అన్నాడీఎంకే త‌మ‌దేనంటూ తీర్మానించి, శ‌శిక‌ళ‌ను పార్టీ నుంచి పంపిస్తున్న‌ట్టు కూడా చెప్పింది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌మిళ‌నాట అన్నాడీఎంకే స‌త్తాచూపే ఛాన్స్ పెద్ద‌గా క‌నిపించ‌ట్లేదు. ఈ పార్టీ చేయి ప‌ట్టుకొనే.. త‌మిళ‌నాట తిష్ట‌వేయాల‌ని భావిస్తోంది బీజేపీ. అయితే.. ప‌ళ‌నిస్వామిని ముందు పెడితే అది వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌ట్లేద‌ని రూట్ మార్చార‌ట‌.

ఇందులో భాగంగా.. శ‌శిక‌ళ‌ను రంగంలోకి దించార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు శ‌శిక‌ళ వ‌ర్గాన్ని త‌మ ఆధ్వ‌ర్యంలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దించాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. అంటే.. ఇటు బీజేపీ, అటు అన్నాడీఎంకే, మ‌రోవైపు శ‌శిక‌ళ వ‌ర్గం క‌లిసి పోటీచేస్తాయ‌న్న‌మాట‌. కానీ.. ఇక్క‌డ కండీష‌న్ అప్లై అవుతుంది. శ‌శిక‌ళ వ‌ర్గం పోటీచేయాల్సింది అన్నాడీఎంకే గుర్తుపైన కాదు.. క‌మ‌లం గుర్తుపై బ‌రిలో నిల‌వాల్సి ఉంటుంద‌ట‌. ఈ విష‌య‌మై రెండు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు కూడా ముగిశాయ‌ట‌. శ‌శిక‌ళ ప్ర‌తినిధిగా ధిన‌క‌ర‌న్ ఈ మీటింగ్ ల‌కు హాజ‌ర‌య్యారు.

అయితే.. ఈ ప్ర‌తిపాద‌న‌కు శ‌శిక‌ళ సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. ఒక‌సారి బీజేపీ ముద్ర ప‌డితే.. ఇక‌వారంతా బీజేపీ నేత‌లుగానే మారిపోతారు. ఆ త‌ర్వాత అంతా కాషాయ పార్టీ చెప్పిన‌ట్టుగానే వినాల్సి వ‌స్తుంది. త‌ద్వారా.. శ‌శిక‌ళ‌ తన ఆధిప‌త్యం చేజేతులా వారికి అప్ప‌గించిన‌ట్టే అవుతుంది. ఈ కార‌ణంగా సొంతంగానే బ‌రిలో దిగాల‌ని చూస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి, ఏం జ‌రుగుతుంది? శ‌శిక‌ళ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుందనే విష‌యం హాట్ టాపిక్ గా మారింది.