Begin typing your search above and press return to search.

ఎన్నికలంటే తమిళనాడువే..! ఒక్క నియోజకవర్గంలో 84 మంది బరిలో..!

By:  Tupaki Desk   |   22 March 2021 12:53 PM GMT
ఎన్నికలంటే తమిళనాడువే..! ఒక్క నియోజకవర్గంలో 84 మంది బరిలో..!
X
రసవత్తర రాజకీయాలకు తమిళనాడు పెట్టింది పేరు. వినూత్న ప్రచారాలు, వింత ధోరణులు అక్కడ కామన్​. అందుకే దేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తుంది. అక్కడి ఎన్నికలపై ఆసక్తి కనబరుస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే నెలకొన్నది.దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాల నుంచి సైడ్​ అవ్వడంతో కొంత ఆసక్తి తగ్గింది. ఆమె మేనల్లుడు మాత్రం పోటీలోనే ఉన్నారు. మరోవైపు కమల్​హాసన్​ పార్టీ మక్కల్​ నీది మయ్యం పార్టీ కూడా పోటీలోనే ఉంది.

అయితే ఇప్పుడు తమిళనాడులోని కరూర్​ అనే నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అందుకు కారణం అక్కడ ఏకంగా 84 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఒక్క ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 84 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో నాలుగు ఈవీఎంలు పెట్టాల్సి వస్తుంది. మరోవైపు ప్రధాన పార్టీల్లోనూ భయాందోళన నెలకొన్నది. ఎందుకంటే ఓటర్లు నాలుగు ఈవీఎంలు పరిశీలించి ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున తమ గుర్తును పోలి ఉన్న మరో గుర్తుమీద ఓటు వేస్తే వాళ్లకు దెబ్బ పడ్డట్టే.

ఈ విషయమై ఎన్నికల అధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎం అత్యాధునిక పరిజ్ఞానంతో కూడుకొనిఉన్నాయని, అభ్యర్థులు ఎక్కువ మంది వుంటే ఒక పోలింగ్‌ కేంద్రంలో నాలుగు ఈవీఎంలు మాత్రమే వినియోగించాలనే నిబంధన లేదని, అభ్యర్థులు ఎక్కువైతే 24 ఈవీఎంలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. 200 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, పోలింగ్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారి తెలిపారు. అయితే అభ్యర్థులు ఎక్కువైతే ఎన్ని ఈవీఎలు అయినా ఏర్పాటు చేయవచ్చని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. అవసరాన్ని బట్టి 24 ఈవీఎంలు కూడా ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు.