Begin typing your search above and press return to search.

పదేళ్లలో దేశ ప్రధాని ఎవరో చెప్పేశారు.. కావాలంటే రాసి పెట్టుకోమన్నాడు

By:  Tupaki Desk   |   1 April 2021 10:30 AM GMT
పదేళ్లలో దేశ ప్రధాని ఎవరో చెప్పేశారు.. కావాలంటే రాసి పెట్టుకోమన్నాడు
X
పదేళ్లలో దేశ ప్రధానిగా ఎవరు ఉంటారు? ఇలాంటి ప్రశ్న వినక ముందు ఆలోచనలు పెద్దగా రాదు కానీ.. ఒకసారి మదిలోకి ఈ ప్రశ్న వచ్చిన తర్వాత మాత్రం.. ఎవరయ్యే అవకాశం ఉందన్న సందేహం కలుగక మానదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2023 వరకు మోడీనే ప్రధాని. ఆ విషయంలో మరో ఆలోచనకు తావు లేదు. ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగితే.. ముచ్చటగా మూడోసారి కూడా దేశ ప్రధానిగా మోడీనే కుర్చీలో కూర్చునే వీలుంది. ఆ తర్వాత సంగతేమిటి? అన్నది పెద్ద ప్రశ్నే.

ఎందుకంటే.. ఇప్పటికే దేశంలోమోడీ వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. కాకుంటే.. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు.. ఎన్నికల వేళలో ఆ పార్టీ కదుపుతున్న పావుల కారణంగా ఇప్పటికిప్పుడు ఆ పార్టీ తన వద్ద పోగుపడిన అధికారాన్ని చేజార్చుకునే అవకాశం లేదు. తర్వాత ఏమిటన్న సంగతిని తాజాగా ఒక నేత ప్రస్తావించి విషయాన్ని ఆసక్తికరంగా మార్చారు. డీఎంకే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న దురైమురగన్.. తాజాగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

కృష్ణగిరి జిల్లా బర్గూర్‌ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థిగా బరిలో ఉన్న మధుసూదన్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. తాను చెప్పే మాటల్ని రాసి పెట్టుకోవాలని.. పదేళ్లలో స్టాలిన్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే జాతి అన్న లక్ష్యంతో కేంద్రం పాలన సాగిస్తోందని.. పలు భాషలు.. సంప్రదాయాలు.. సంస్కృతి ఉన్న భారత్ లో వాటిని రూపుమాపేలా ప్రమాదకర చర్యల్ని కేంద్రం అనుసరిస్తోందని.. అందుకు ధీటుగా ఎదుర్కొనే నాయకుడు ఒకరు కావాలని దేశ ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు.

అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి స్టాలిన్ అని ఆయన పేర్కొన్నారు. దురైమురుగన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అధికారాన్ని సొంతం చేసుకోవటం ఖాయమని సర్వేలు చెబుతున్న వేళ.. దురైమురుగన్ నోటి నుంచి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పక తప్పదు.