Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ సంచలనం.. తమిళనాడులో నోట్ల కట్టలు సీజ్​..!

By:  Tupaki Desk   |   6 April 2021 12:45 PM GMT
ఎన్నికల వేళ సంచలనం.. తమిళనాడులో నోట్ల కట్టలు సీజ్​..!
X
ప్రస్తుతం ఎన్నికలంటేనే డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. పోలింగ్​ కు ముందురోజు భారీగా డబ్బులు పంచడం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం కామన్​. ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటుచేసి .. ద్వితీయశ్రేణి నాయకుల ద్వారా డబ్బులను పంపిణీ చేయడం రాజకీయనాయకులకు అలవాటు. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో భారీగా డబ్బు నగదు పట్టుబడింది. భారీగా అంటే వందల కోట్ల నగదు. కిలోల కొద్దీ బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్​ చేశారు. ఈ డబ్బు డీఎంకే అధినేత స్టాలిన్​ బంధువుదే అన్న ప్రచారం కూడా సాగింది.

నాలుగు వందల కోట్లకు పైగా నగదు, బంగారం అధికారులు సీజ్​ చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బును ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఎన్నికలంటే పోల్​ మేనేజ్​మెంట్​. పోల్​ మేనేజ్​మెంట్​ తెలిసిన వాడే కింగ్​. అంటే ఓటర్లను పోలింగ్​ స్టేషన్​ తీసుకెళ్లి ఓట్లు వేయించగలిగిన సత్తా ఉన్నవాడే హీరో. అటువంటి వాళ్లు అన్ని పార్టీలకు పుష్కలంగా ఉంటారు. పోలింగ్​ ముందురోజు ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం.. విందు వినోదాలు అందించడం.. కావాల్సిన డబ్బు ఇవ్వడం.. ఇతరత్రా కానుకలు ఇవ్వడం ఆ తర్వాత పోలింగ్​ బూత్ కు తీసుకెళ్లడం. ఇది ఏ పార్టీ సమర్థవంతంగా చేయగలిగితే వారిదే గెలుపు.

ఇదిలా ఉంటే తమిళనాడులో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నగదు రూ.225.5 కోట్లు, సుమారు రూ.176 కోట్ల విలువైన బంగారాన్ని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. మద్యం, గృహోపకరణాలు పట్టుబడ్డట్టు సమాచారం. వీటి మొత్తం విలువ రూ.428 కోట్లు ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.

చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూర్ తదితర చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. అత్యధికంగా కరూర్‌ లో భారీగా నగదు పట్టుబడింది. ఆ తర్వాత కోయంబత్తూరు, తిరుప్పూర్, చెన్నైలలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.అలాగే రాణిపేట జిల్లాలో రూ.91 లక్షలు, చెన్నై నగరంలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో సుమారు రూ1.15 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.