Begin typing your search above and press return to search.

సీఎస్.. డీజీపీలకు చుక్కలు చూపిన గవర్నర్

By:  Tupaki Desk   |   11 Feb 2017 4:44 AM GMT
సీఎస్.. డీజీపీలకు చుక్కలు చూపిన గవర్నర్
X
అటు రాష్ట్రపతిని.. ఇటు గవర్నర్ ను రబ్బర్ స్టాంప్ గానే చూస్తారు.కానీ.. సమయం వచ్చినప్పుడే వారెంత పవర్ ఫుల్ అన్న విషయం తెలుస్తుంది. నామ మాత్రం అన్నట్లు కనిపించినా.. కీలక సమయాల్లో వారి రోల్ ఎలా ఉంటుందన్నది తాజాగా తమిళనాడును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు గవర్నర్ ఉత్సవ విగ్రహమే. కానీ.. ఏ మాత్రం తేడా వచ్చినా గవర్నర్ రోల్ ‘కీ’గా మారిపోతుంది.

తాజాగా తమిళనాడుకు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావు తీరుకు ఆ రాష్ట్ర సీఎస్.. డీజీపీలు నీళ్లు నమిలేశారు. నోట మాట రాకుండా ఉండిపోయారు. తన అనుమతి లేకుండా మెరీనా బీచ్ కు సమీపంలోని మద్రాస్ వర్సిటీ సెంటినరీహాట్లో చిన్నమ్మ ప్రమాణస్వీకారానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయటంపై ఆయన తీవ్రంగా మండిపడటమే కాదు.. ఎవరిని అడిగి ఈ ఏర్పాట్లు చేశారన్న సూటిప్రశ్నకు కీలక అధికారులు ఇద్దరూ డిఫెన్స్ లో పడినట్లుగా తెలుస్తోంది.

తనను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక చేసిన కొద్ది గంటలకే తన ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె ఆదేశించటం.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు జరిగిపోవటం తెలిసిందే. తాజాగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో తన వద్దకు పిలిపించుకున్న సీఎస్.. డీజీపీలను ఉద్దేశించి గవర్నర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. సీఎంగా శశికళను ప్రమాణస్వీకారం చేయటానికి ఎవరు ఆదేశాలు జారీ చేశారని ప్రశ్నించటమే కాదు.. ప్రజా ధనాన్ని ఎందుకు వృధా చేశారని నిలదీయటం గమనార్హం.

వీటన్నింటికి మించి.. చిన్నమ్మ ప్రమాణస్వీకారోత్సవానికి జనాలు భారీగా వస్తారన్న అంచనాతో మెరీనా బీచ్ వద్దఉన్న 144వ సెక్షన్ ను ఎత్తివేయటాన్ని క్వశ్చన్ చేసిన ఆయన.. తన అనుమతి లేకుండా ప్రమాణస్వీకారోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేయొద్దని స్పస్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో సెంటినరీ హాల్ వద్ద ఏర్పాట్లు చేసిన బందోబస్తును.. పోలీస్ సిబ్బందిని ఉపసంహరించారు.

తాజా పరిణామం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.గవర్నర్ ఫైరింగ్ చూస్తే.. చిన్నమ్మకు అవకాశాలు తక్కువన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. అంచనాల్ని పక్కన పెడితే.. గవర్నర్ ఆదేశాలు లేకుండా ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయటం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుందని చెప్పకతప్పదు.