Begin typing your search above and press return to search.

తమిళనాడుకు ఒక రూలు.. ఏపీకి మరొక రూలు ఉంటుందా!?

By:  Tupaki Desk   |   9 April 2015 5:30 PM GMT
తమిళనాడుకు ఒక రూలు.. ఏపీకి మరొక రూలు ఉంటుందా!?
X
అక్రమం.. అన్యాయం.. అనేవి ఆంధ్రప్రదేశ్‌లో అయినా అమెరికాలో అయినా ఒకటే కదా! తమిళనాడులో అయినా శ్రీలంకలో అయినా ఒకటే కదా! తమిళనాడులో అన్యాయం అయినది శ్రీలంకలో న్యాయం కాదు కదా! శ్రీలంకలో న్యాయం అయినది తమిళనాడులో అన్యాయం కాదు కదా! కానీ, తమిళనాడు మాత్రం ఇందుకు భిన్నమైన వాదన చేస్తోంది. మేం చంపితే అది నేరంపై ఉక్కుపాదం మోపడమని.. ఇతరులు చేస్తే మాత్రం మానవ హక్కుల ఉల్లంఘన అని అంటోంది.

వీరప్పన్‌ కూడా ఎర్ర చందనం దొంగే. తమిళనాడు, కర్ణాటక అడవుల్లో ఎర్ర చందనం దుంగలను దోపిడీ చేశాడు. ప్రభుత్వాలను గడగడలాడించాడు. ప్రభుత్వ అధికారులను హతమార్చాడు. అతనిని పట్టుకోవడానికి అప్పటి తమిళనాడు ప్రభుత్వం పెద్దఎత్తున టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అడవవిని జల్లెడ పట్టింది. అప్పట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌లో భాగంగా వందలాదిమంది కూలీలను మట్టుబెట్టారు. వీరప్పన్‌ను పట్టుకోవడానికి వీలుగా ముందుగా కూలీలు, చిన్న చిన్న స్మగ్లర్లు తదితరులను హతమార్చారు. చివరికి, వీరప్పన్‌ను ఒంటరి చేసి పట్టుకున్నారు. అప్పట్లో తమిళనాడు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులే తమ తమిళనాడుకు చెందిన కూలీలనే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. అయినా, ఏ ఒక్కరూ అప్పట్లో మానవ హక్కుల గురించి మాట్లాడలేదు.

కానీ, అప్పట్లో ఒక్కడే వీరప్పన్‌ ఉంటే ఇప్పుడు వీరప్పన్‌ వంటి గంగిరెడ్డిలు బోల్డంత మంది తయారయ్యారు. వాళ్లకి చెక్‌ చెప్పాలంటే ముందుగా కూలీలకు అడ్డుకట్ట వేయాలి. కూలీలకు అడ్డుకట్ట వేయకుండా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవడం అసాధ్యం. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్లోనే కూలీలు చనిపోయారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వానిది కూడా మెజారిటీ తప్పు ఉంది. అయినా, అక్కడి సంఘాలు, ప్రభుత్వం మాత్రం ఏపీ ప్రభుత్వాన్నే నిందించడానికి ప్రయత్నిస్తున్నాయి ఇదెంత వరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ తప్పంటూ ఉంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనే వాదన వినిపిస్తోంది.