Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌తో శ‌శిక‌ళ‌...పోస్ట‌ర్ల‌తో సెల్వం హ‌ల్ చల్‌

By:  Tupaki Desk   |   12 Feb 2017 6:05 PM GMT
ఎమ్మెల్యేల‌తో శ‌శిక‌ళ‌...పోస్ట‌ర్ల‌తో సెల్వం హ‌ల్ చల్‌
X
అన్నాడీఎంకే అధినేత్రి హోదాలో త‌మిళ‌నాడు సీఎం పీఠంపై క‌న్నేసిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ.. క్యాంపు రాజ‌కీయాలు ముమ్మ‌రం చేశారు. ఇవాళ మ‌రోసారి త‌న వ‌ర్గం ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. శ‌నివారం సాయంత్రం కూడా ఎమ్మెల్యేల‌తో ఆమె స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఓవైపు ప్ర‌త్య‌ర్థి పన్నీరుసెల్వం వ‌ర్గం బ‌ల‌ప‌డుతుండ‌టం.. మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావు ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌రించ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న‌లో ఉన్న శ‌శిక‌ళ‌.. మ‌రోసారి ఎమ్మెల్యేల‌ను క‌లిసి త‌న కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై చ‌ర్చించారు. అనంత‌రం వారితో మీడియా ముందుకు పెరేడ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడారు. త‌మ వ‌ర్గంలోని ఎమ్మెల్యేలంతా స్వ‌చ్ఛందంగా మ‌ద్ద‌తిస్తున్న వారే త‌ప్పించి ఎవ‌రినీ బ‌లవంతం పెట్ట‌డం లేద‌ని తెలిపారు. పైగా ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం వారే త‌మ మ‌హిళా ఎమ్మెల్యేల‌కు చేసి బెదిరిస్తున్నార‌ని అన్నారు.

అన్నాడీఎంకే పార్టీని చీల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని శశికళ అన్నారు. ఇవి తమకు కొత్తేం కాదని, ఇలాంటివి గతంలోనూ అమ్మ(జయలలిత) ఉన్నప్పుడు జరిగాయని గుర్తుచేశారు. తాను గవర్నర్ కు రాసినట్టు ఓ నకిలీ లెటర్ సర్క్యులేట్ అవుతోందని, ఓ మహిళ రాజకీయాల్లోకి రావడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. తమకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, కుట్రల్ని ఛేదిస్తామన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని శశికళ స్పష్టం చేశారు.ఓ మహిళగా రాజకీయాల్లో ఉండటం చాలా కష్టమని, జయలలిత ఉన్న సమయంలోనూ తాను ఈ పరిస్థితులు ఎదుర్కొన్నానని శశికళ అన్నారు. ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారని, వారితో మాట్లాడతానని చెప్పారు. కాగా, గ‌వ‌ర్న‌ర్ వెంట‌నే నిర్ణ‌యం వెలువ‌రించ‌క‌పోతే ప‌రిణామాలు వేరుగా ఉంటాయ‌ని ఇప్ప‌టికే ఆమె హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్‌పై ఒత్తిడి తీసుకురావ‌డానికి ఆమె నిరాహార దీక్ష‌కు కూడా దిగనున్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రోవైపు ప‌న్నీరు వ‌ర్గం కూడా వేగంగా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ప‌ది మంది ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంది. మ‌రో 11 మంది ఎమ్మెల్యేలు శ‌శిక‌ళ వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే.. ఆమె సీఎం క‌ల క‌ల‌గానే మిగిలిపోనుంది. నాలుగు రోజులుగా టీవీలు, పత్రికలకే పరిమితమైన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. తాజాగా గోడలకు ఎక్కారు. టీవీలు, పత్రికలు చూడని సామాన్యుల దగ్గరకి కూడా చేరేందుకు పోస్టర్లు వేస్తున్నారు. సినిమాల ప్రచారానికి వేసే సైజు భారీ పోస్టర్లు చెన్నైలోని ఆయన ఇంటి దగ్గర, చుట్టుపక్కల ప్రాంతాల్లో గోడలపై అంటిస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో జయలలిత సమాధి దగ్గర నాలుగు రోజుల కిందట పన్నీర్ సెల్వం మౌనదీక్ష చేసిన ఫోటో, జయలలిత ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న ఫోటోని కలిపి పోస్టర్ తయారు చేశారు. అమ్మకు ఏకైక రాజకీయ వారసుడు పన్నీర్ సెల్వం అని పెద్ద అక్షరాలతో పోస్టర్లపై ప్రచురించారు.