Begin typing your search above and press return to search.

తమిళనాడు లేటెస్ట్ అప్ డేట్స్ @7PM

By:  Tupaki Desk   |   11 Feb 2017 1:39 PM GMT
తమిళనాడు లేటెస్ట్ అప్ డేట్స్ @7PM
X
తమిళనాడు పొలిటికల్ హర్రర్ థిల్లర్ సా..గుతోంది. రోజులు గడుస్తున్నా.. పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నా.. విషయం ఒక కొలిక్కి రాలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం చిన్నమ్మ.. పన్నీర్ సెల్వం మధ్య సాగుతున్న పొలిటికల్ జల్లికట్టు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించటమే కాదు.. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిని ఏర్పడేలా చేస్తోంది. ఒక్కడిగా మొదలై.. నలుగురంటే నలుగురు ఎమ్మెల్యేలతో చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా విసిరిన పన్నీర్.. రోజులు గడిచేకొద్దీ బలపడుతుంటే.. అందుకుభిన్నంగా 131 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆమె మాత్రం నిరాశ నిస్పృహలకు లోనయ్యే పరిస్థితి.

ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రంవరకూ చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే..

1. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్ని దాచి ఉంచిన రిసార్ట్స్ లోకి వెళ్లిన పోలీసులు.. రెవెన్యూ అధికారులు అక్కడున్న ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి వాదనను రికార్డు చేశారు. రిసార్ట్స్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని చిన్నమ్మ వర్గానికి చెందిన ప్రైవేటు సైన్యం అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారిని కంట్రోల్ లోకి తెచ్చి లోపలకు వెళ్లారు. ఒక దశలో పోలీసు వాహనాలపై చిన్నమ్మ వర్గానికి చెందిన కొందరు కిరాయి మూకలు రాళ్లు విసరటం గమనార్హం.

2. వరుస దెబ్బలు తగులుతున్న చిన్నమ్మకు శనివారం ఆ షాకుల పర్వం ఆగలేదు. ఆమెకు అత్యంత విధేయుడైన మంత్రి పాండ్యరాజన్ ట్వీట్ తో తాను పన్నీరు వైపు వెళ్లనున్నట్లుగా ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు కొనసాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల పన్నీర్ పై విమర్శలు చేయటంతో పాటు.. డీఎంకేతోకలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా ఘాటు విమర్శలు చేసిన ఆయన రోజు ప్లేట్ మార్చేయటం గమనార్హం. వీరితో పాటు మరో ఇద్దరు ఎంపీలు పన్నీర్ కు మద్దతు ప్రకటించారు.మరో ఇద్దరు మంత్రులు కూడా పన్నీర్ కు తమ మద్దతును ప్రకటించారు

3. చిన్నమ్మకు చెందిన ఎమ్మెల్యేలుగా ఇప్పటివరకూ ఉన్నఅంచనాల్లో లెక్క తేడా వచ్చేసింది. 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా చెప్పినప్పటికీ.. తాజాగా గోల్డెన్ బే రిసార్ట్ లో కేవలం 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లుగా లెక్క తేలింది.

4. గోల్డెన్ బేలో ఉన్న చిన్నమ్మ వర్గీయులుగా చెబుతున్న ఎమ్మెల్యేల్లో దాదాపు 20 మంది ఆమెకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. వారిని బుజ్జగించేందుకు చిన్నమ్మే నేరుగా రంగంలోకి దిగారు. ఇందుకోసం తానే స్వయంగా రిసార్ట్ కువెళ్లి.. అక్కడి నుంచిరాజ్ భవన్ కు ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.

5. పార్టీలో.. ప్రజల్లో తన మీద పెరుగుతున్న అసంతృప్తిని కట్టడి చేసేందుకు.. పన్నీర్ దూకుడుకు కళ్లాలు వేసేందుకు చిన్నమ్మ మాస్టర్ ప్లాన్ వేశారు. తాను సీఎం పదవిని చేపట్టనని.. తన స్థానంలో మధ్యేమార్గంగా కొత్త సీఎం అభ్యర్థి పేరును తెరపైకి తీసుకొచ్చారు. అన్నాడీఎంకే ప్రీసిడియం ఛైర్మన్ గా తాను ఎంపిక చేసిన సెంగొట్టాయన్ ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు.

6. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటానికి గవర్నర్ సిద్ధంగా లేరన్న వాదనల నేపథ్యంలో తన ప్లాన్ ను మార్చేసుకున్న శశికళ.. తనకు అత్యంత విధేయుడైన సెంగొట్టాయన్ ను తెర మీదకు తీసుకొచ్చి.. ఆయనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న మాటను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

7. పన్నీర్ సెల్వంకు శశికళ వర్గానికి చెందిన నేతలే కాదు.. ప్రజల నుంచి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పలు వర్గాల వారు పన్నీర్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా లాయర్లు సైతం పన్నీర్ కు తమ మద్దతును ప్రకటించారు.ఆయన ఇంటి ముందుకు వచ్చిన లాయర్ల బృందం ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని నినాదాలు ఇవ్వటం గమనార్హం.

8. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు తనను బాధిస్తున్నాయని ప్రముఖ సినీ నటి.. రాజకీయనాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభం సమిసిపోవాలని తాను కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. తాను వ్యక్తిగతంగా శశికళకు మద్దతు ఇస్తానని పేర్కొన్నారు.

9. అంతకంతకూ మారిపోతున్న పరిణామాలు.. పార్టీపై పట్టు తప్పి పోతున్నవేళ.. ఇంతకాలం కామ్ గా ఉన్న శశికళలో ఒక్కసారి ఆవేశం తన్నుకొచ్చింది. తాజాగా ఒక లేఖ ద్వారా గవర్నర్ కు ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. తనకు మరోసారి అపాయింట్ మెంట్ ఇవ్వాలని.. తమకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. సీఎం పదవికి రాజీనామా చేసి 30 రోజులైందని.. ఆ రాజీనామాను గవర్నర్ ఆమోదించారని.. ఇక కొత్త ముఖ్యమంత్రిని నియమించటానికి ఆలస్యం చేయొద్దని కోరారు.

10. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన శశికళ.. అన్నాడీఎంకే కొంతకాలం మాత్రమే వేచి ఉంటుందని.. అమ్మ జయలలిత తనకు ఎందరినో అభిమానుల్ని.. మద్దతుదారుల్నివిడిచిపెట్టి వెళ్లారన్నారు.

11. మరోవైపు శశికళకు సీఎం కుర్చీలో కూర్చోవాలన్న అంత ఆత్రుత ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు నిజంగానే మద్దతు ఉంటే.. వారంతా ఎప్పటికైనా ఆమెపైనే ఉంటారని.. అలాంటప్పుడు గవర్నర్ కు లేఖ రాయాల్సిన అవసరం ఏమి వచ్చిందని అడుగుతున్నారు.

12. 30 కార్ల కాన్వాయ్ తో శశికళ రాయల్ బే రిసార్ట్స్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల్ని కలిసి.. వారితో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.

13. గవర్నర్ కు చిన్నమ్మ లేఖ రాసిన వైనంపై రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘ఆమె గవర్నర్ నే బెదిరిస్తున్నారా?’ అంటూ ఆయన ప్రశ్నించారు. తన తీరుతోశశికళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చూడాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

14. పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. అందరూ త్వరలో ఆయన వద్దకు వస్తారంటూ మంత్రి పాండ్య రాజన్ వ్యాఖ్యానించటం గమనార్హం.

15. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై పన్నీర్ మీడియాతో మాట్లాడారు. తమను అమ్మ ఆత్మే నడిపిస్తోందని.. చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. త్వరలో ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

16. అమ్మ నివాసమైన పోయెస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చే జీవో మీద అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంతకం చేశారు. దీనిపై అమ్మ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో అమలైతే.. శశికళ వేదనిలయం నుంచి తట్టాబుట్టా సర్దుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది.అయితే.. ఈ వార్తలో నిజం లేదని.. తన డిమాండ్ పై సంతకాల ఉద్యమాన్ని చేపట్టాలన్న వాదనను మరికొందరు వినిపిస్తున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

17. తనకు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేలతో శశికళ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేసినట్లుగా తెలుస్తోంది. తనకు మంచి జరగని పక్షంలో ఏం చేయాలో తనకు తెలుసని.. తన సహనాన్ని పరీక్షించొద్దంటూ ఆమె వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు.. చెన్నైలోకి అల్లరి మూకలు ప్రవేశించాయన్న వార్తలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

18. చిన్నమ్మ చెప్పినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలపై గవర్నర్ విద్యాసాగర్ రావు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని లాడ్జిలు.. రిసార్టుల్లో ఉన్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీంతో.. చెన్నై కమిషనర్ చెన్నైలోనిఅన్ని లాడ్జిలు.. హోటళ్లు.. రిసార్టులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు.. గవర్నర్ కానీ చిన్నమ్మకు వ్యతిరేకంగా తన నిర్ణయం ప్రకటించినంతనే చెన్నైలో అల్లర్లు సృష్టించేందుకు అల్లరిమూకలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

19. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలతో చిన్నమ్మ తాజాగా భేటీ అయ్యారు. తమ తరఫు ముఖ్యమంత్రిగా సెంగొట్టియన్ ను గవర్నర్ ముందు ప్రతిపాదించే విషయాన్ని ఎమ్మెల్యేలతో చిన్నమ్మ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

20. రాజ్ భవన్ పరిసరాల్లో భారీగా భద్రతాదళాలు మొహరించాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

21. శశికళకు బహిరంగంగా మద్దతు ఇస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడుసుబ్రమణ్య స్వామి తాజాగా గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చలు జరపటంప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీరు వర్గానికి బీజేపీ అధినాయకత్వం అండఉందని చెబుతున్న వేళ.. శశికళకు మద్దతు పలికే సుబ్రమణ్య స్వామి గవర్నర్ నుపలకటం ఆసక్తికరంగా మారింది.

22. గోల్డెన్ బే రిసార్ట్స్ లో తన వర్గీయులతో భేటీ అయిన శశికళ..తన తాజావ్యహాన్ని వారికి చెప్పటంతోపాటు.. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల్ని బుజ్జగించినట్లుగా చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలతో చిన్నమ్మ భేటీ ముగిసింది (రాత్రి 7 గంటల వేళలో)