Begin typing your search above and press return to search.

త‌మిళ పోరుః రెంటికీ చెడ్డ రేవ‌డిలా విజ‌య్ కాంత్?

By:  Tupaki Desk   |   10 March 2021 3:30 AM GMT
త‌మిళ పోరుః రెంటికీ చెడ్డ రేవ‌డిలా విజ‌య్ కాంత్?
X
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌వుతున్న కొద్దీ త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మ‌రింత‌గా వేడెక్కుతున్నాయి. పొత్తులు, సీట్ల పంప‌కాలు తుది ద‌శ‌కు చేరు‌కున్నాయి. ఏ పార్టీలు ఏయే గ్రూపులో కొన‌సాగాలో దాదాపుగా ఖ‌రారైపోయింది. కానీ.. విజ‌య్ కాంత్ ప‌రిస్థితే అయోమ‌యంగా మారింది. ప‌రిస్థితి చూస్తుంటే.. ఆయ‌న ఒంట‌రిగానే బ‌రిలోకి దిగాల్సి వ‌చ్చేట్టుంది.

మొన్న‌టి వ‌ర‌కు అన్నా డీఎంకే కూట‌మిలో ఉన్నారు విజ‌య్ కాంత్. కానీ.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ ఒక్క‌సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది. అయితే.. ఈ సారి ఎన్నిక‌ల్లో త‌మ‌కు 23 సీట్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టింది డీఎండీకే. అయితే.. అన్నాడీఎంకే మాత్రం 15 సీట్లు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డింది. అది కూడా విజ‌య్ కాంత్ కోరిన చోట కాకుండా.. వేరే ప్రాంతాల్లో! దీంతో.. ఆగ్ర‌హించిన కెప్టెన్ దోస్తీ క‌టీఫ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే.. ఇప్పుడు క‌మ‌ల్ పార్టీ కూట‌మిలోనూ అవ‌కాశం లేకుండా పోయింది. ఇప్ప‌టికే సీట్ల పంప‌కాలు పూర్త‌య్యాయి. శ‌ర‌త్ కుమార్ పార్టీ ఆల్ ఇండియా స‌మ‌తువ మ‌క్క‌ల్ క‌ట్చి (ఏఐఎస్ఎంకే), ఇండియ‌న్ జ‌న‌నాయ‌క క‌ట్చి (ఐజేకే) పార్టీల‌తో క‌మ‌ల్ పొత్తు క‌న్ఫాం చేశారు క‌మ‌ల్‌. ఈ మేర‌కు మూడు పార్టీల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో 154 చోట్ల క‌మ‌ల్ ఎంఎన్ఎం పోటీ చేయ‌నుంది. మిగిలిన 80 స్థానాల్లో ఐజేకే, ఏఐఎస్ఎంకే చెరో 40 చోట్ల బ‌రిలో నిల‌వనున్నాయి.

అటు దిన‌క‌ర‌న్ పార్టీతోనూ పొత్తుకు అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. అక్క‌డ కూడా సీట్ల పంప‌కాలు పూర్త‌య్యాయి. దీంతో.. ఇప్పుడు కెప్టెన్‌ విజ‌య్ కాంత్ సింగిల్ గానే బ‌రిలో నిల‌వాల్సి వ‌స్తోంద‌ని స‌మాచారం. ఇదేగ‌న‌క నిజ‌మైతే.. కెప్టెన్ కు ఇబ్బందులు త‌ప్ప‌న‌ట్టే. గ‌తంలో పొత్తుతోనే ఒక్క సీటుకూడా గెలుచుకోలేక‌పోయిన విజ‌య్ కాంత్‌.. సింగిల్ గా వెళ్తే ఏమేర‌కు ప్ర‌భావం చూపుతార‌నేది సందేహ‌మే.