Begin typing your search above and press return to search.

మా గబ్బిలం దేవతలకు కరోనా టెస్ట్ చేయండి

By:  Tupaki Desk   |   19 April 2020 12:30 PM GMT
మా గబ్బిలం దేవతలకు కరోనా టెస్ట్ చేయండి
X
కరోనా వైరస్ గబ్బిలాల ద్వారానే వేగంగా వ్యాపిస్తుందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవలే ప్రకటించింది. దీంతో గబ్బిలాలంటేనే జనాలు భయపడుతున్నారు. దూరంగా తరిమేస్తున్నారు. ఆలయాలు - మర్రిచెట్లపై నున్న గబ్బిలాలను టపాసులు కాల్చి బెదరకొట్టేస్తున్నారు.

అయితే ఆ గ్రామస్థులు మాత్రం గబ్బిలాలను కంటికిరెప్పాలా దేవుళ్లవలే కొలుస్తున్నారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని గ్రామంలో అత్యంత ప్రాచీనమైన మర్రిచెట్టు ఉంది. దాని దిగువన మునియప్పన్ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ గ్రామానికి ఆ దేవుడే రక్ష అని వాళ్లు నమ్ముతారు. ప్రాచీన కాలం నుంచి ఆ మర్రిచెట్టుపై వేల సంఖ్యలో గబ్బిలాలుంటాయి. వాటిని దేవుడి ప్రతిరూపాలుగా గ్రామస్థులు కొలుస్తుంటారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా పలువురు మరణించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గబ్బిలాలతో తమకు ప్రాణ హాని వాటిల్లుతుందని ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తాజాగా మర్రిచెట్లు ఉన్న గ్రామస్థులందరూ ఏకమై తమ గ్రామాల్లోని గబ్బిలాలకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ ను కోరారు. లేకుంటే తమకు కరోనా వస్తుందని వినతిపత్రం అందించారు.