Begin typing your search above and press return to search.

మోదీపై త‌మ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్...వైర‌ల్ వీడియో!

By:  Tupaki Desk   |   30 Nov 2017 2:44 PM GMT
మోదీపై త‌మ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్...వైర‌ల్ వీడియో!
X
టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ ....ఆ మాటకొస్తే సినీరంగం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌పై, సినిమా వాళ్ల‌పై వ‌స్తున్న అన‌వ‌స‌ర కామెంట్ల‌పై త‌మ్మారెడ్డి త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటారు. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డం త‌మ్మారెడ్డి నైజం. కొద్ది రోజుల క్రితం పెను దుమారం రేపిన `నంది`వివాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ బాబుకు ఆయ‌న ఓ రేంజ్ లో క్లాస్ పీకుతున్న వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అదేత‌ర‌హాలో త‌మ్మారెడ్డి ఈ సారి....ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినీరంగంలో స‌మ‌కాలీన సమస్యలు - సినిమాలపై - సినీరంగానికి చెందిన వ్య‌క్తుల‌పై కొందరి తీరును ఎండగడుతూ ప్రధానిపై త‌మ్మారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించిన వీడియో సొష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

దేశానికి మంచి నాయకుడు కావాలని మోదీని ప్ర‌ధానిగా ఎన్నుకున్నామ‌ని, కానీ ఆయ‌న వ్యవహారశైలి చూస్తుంటే కొంత మందికి మాత్రమే ప్రధాని అనే ఫీలింగ్ కలుగుతోంది. మోదీ అలాంటివారు కాదని త‌మ‌కు గట్టి నమ్మకమ‌ని, కానీ, ఈ మధ్య కాలంలో సినిమాలపై ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా బీజేపీవాళ్లు పడిపోతున్నారని త‌మ్మారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 'ఉడ్తా పంజాబ్' - 'మెర్సల్' - 'పద్మావతి'... ఇలా ఎన్నో సినిమాలపై దాడులు జరుగుతున్నాయ‌ని, సినిమా అనే క్రియేటివిటీని - భావ ప్రకటన స్వేచ్ఛను ఆపే ప్రయత్నం జరుగుతుంటే, ప్ర‌ధాని మాత్రం సైలెంట్ గా ఉంటున్నారన్నారు. ఈ మౌనం వారి చ‌ర్య‌ల‌ను - మాట‌ల‌ను సమర్థిస్తున్నట్టుగానే కనిపిస్తోంద‌ని తమ్మారెడ్డి అన్నారు. సినిమావాళ్ల భార్యలంతా ఎవరితోనే వెళ్లిపోతున్నారంటూ ఓ బీజేపీ ఎంపీ దారుణ వ్యాఖ్యలు చేశారని, అవి విని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. `పద్మావతి`లో న‌టించిన దీపికా ముక్కు కోసేస్తామ‌ని, దీపికా - భ‌న్సాలీల త‌ల‌లు న‌రికేస్తామ‌ని కొంత‌మంది పిలుపునివ్వ‌డంపై మండిప‌డ్డారు.

ఇవ‌న్నీ చూస్తుంటే మళ్లీ ఆటవిక సమాజానికి వెళ్తున్నట్టు అనిపిస్తోంద‌న్నారు. గౌరీ లంకేష్ హ‌త్య‌ను కొంతమంది సెలబ్రేట్ చేసుకోవ‌డ‌న్ని ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ అల్లకల్లోలం చేశాడంటూ కొందరు బీజేపీ నేతలు అతడిపై తీవ్ర విమర్శలు చేశారని తమ్మారెడ్డి అన్నారు. దేశ ప్రధానిని ఏ విష‌యం గురించైనా ప్రశ్నించడం తప్పా మోదీగారు అని తమ్మారెడ్డి ప్ర‌శ్నించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా, ప్ర‌ధాని త‌న మనసులోని మాటను త‌మ‌తో పంచుకుంటున్నారని, త‌మ‌ మనసులోని మాటను కూడా ప్ర‌ధాని వింటే చాలా బాగుంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ వీడియో మోదీ వరకు చేరుతుందనే నమ్మకం కూడా తనకు లేదని, అయితే, ఎవరైనా తన భావనను ప్ర‌ధానికి చెబుతారనే చిన్న ఆశ మాత్రం ఉందని అన్నారు. మోదీ ఏ ఒక్క వర్గానికో ప్ర‌ధాని కాదని, దేశంలోని ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత ఆయ‌న‌పై ఉందని చెప్పారు. సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున‌ తమ్మారెడ్డి ఆవేద‌న ప్ర‌ధాని వ‌ర‌కు చేరాల‌ని ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి త‌మ్మారెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్థానిక‌ బీజేపీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.