Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి గొడ‌వ‌ల‌కు వాళ్లే కార‌ణం..స్పీక‌ర్ త‌మ్మినేని

By:  Tupaki Desk   |   30 Dec 2019 3:09 PM GMT
అమ‌రావ‌తి గొడ‌వ‌ల‌కు వాళ్లే కార‌ణం..స్పీక‌ర్ త‌మ్మినేని
X
ప్ర‌స్తుతం ఏపీలో మూడు రాజ‌ధానుల అంశం రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి మూడు రాజ‌ధానుల ప్ర‌క‌న‌ట చేసిన‌ప్ప‌టి నుంచే అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చి రెండు వారాలు దాటుతున్నా ఆందోళ‌న‌లు - రాజ‌కీయ వేడి మాత్రం త‌గ్గ‌లేదు. అటు వైజాగ్‌ కు రాజ‌ధానితో మ‌హ‌ర్ద‌శ ప‌డుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో వైజాగ్ ప్ర‌జ‌లు మూడు రాజ‌ధానుల‌ను స్వాగ‌తిస్తుంటే... అమ‌రావ‌తిలో మాత్రం రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే విష‌యం అటు టీడీపీతో పాటు బీజేపీ నేత‌ల్లోనూ సెగ‌లు రేపుతోంది.

ఈ రెండు పార్టీల నేత‌లు సైతం రెండుగా చీలిపోయారు. ఎవరికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సైతం అమ‌రావ‌తిపై ఏదో ఒక వివాస్ప‌ద వ్యాఖ్య చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. మొన్న‌టికి మొన్న ఆయ‌న అమరావతిని రాజస్థాన్ ఎడారి అంటూ, వందేళ్ళు అయిన అమరావతి అభివృద్ధి జరిగిందంటూ సంచ‌ల‌నం రేపారు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు.

తాజాగా త‌మ్మినేని మ‌ళ్లీ అమ‌రావ‌తిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సారి అక్క‌డ ఆందోళ‌న‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతోన్న ఆందోళ‌న‌ల వెన‌క స్థానికులు ఎవ్వ‌రూ లేర‌ని.. అక్క‌డ అక్ర‌మంగా భూములు కొన్న‌వారే ఉన్నార‌ని ఆరోపించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటవుతుందనే అంశంలో ఎవరికీ సందేహం అక్కర్లేదని.. అదే టైంలో అమ‌రావ‌తి ఎడ్యుకేష‌న్ హ‌బ్‌ గా అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పేశారు.

విశాఖ రాజ‌ధాని అయితే ఉత్త‌రాంధ్ర అంతా అభివృద్ధి చెందుతుంద‌ని.. చంద్ర‌బాబు మాత్రం విశాఖ రాజ‌ధాని అవుతుంటే ఓర్వ‌లేక‌పోతున్నార‌ని త‌మ్మినేని విమ‌ర్శించారు. ఏదేమైనా ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు అంద‌రూ రాజ‌ధాని విశాఖే అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఇక ఇప్పుడు త‌మ్మినేని సైతం అదే విష‌యాన్ని నొక్కి వ‌క్కాణించ‌డంతో విశాఖ రాజ‌ధాని అన్న‌దానిపై సంపూర్ణ‌మైన క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది.