Begin typing your search above and press return to search.

బాబు విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..స్పీకర్ ప్రశ్న

By:  Tupaki Desk   |   12 Jan 2020 4:48 PM GMT
బాబు విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..స్పీకర్ ప్రశ్న
X
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై అసెంబ్లీ స్పీకర్ సీతారాం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. అమరావతి విషయంలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ చేశారని.. ఆయన తాబేదార్లు - రాజకీయ బ్రోకర్లు వేలాది ఎకరాలు కొన్నారని ఆరోపించారు. తానేమీ రాజకీయాలు మాట్లాడడం లేదని - రాజధానుల విషయం మాట్లాడుతున్నానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నిర్ణయాలు కారణంనే పూర్తిగా భూస్థాపితమయ్యే రోజొస్తుందన్నారు.

రాజధాని రైతుల వద్ద నుంచి భూములు లాక్కుని వాటిని అమ్మి రాజధాని కడతానని చంద్రబాబు అన్నారని - అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకపోతే మరేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విజన్ 2020 అంటే ఏమో అనుకున్నానని.. జోలెపట్టి రోడ్డు మీద భిక్షాటన అనుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదనలను అందరూ స్వాగతిస్తున్నారని.. ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా తాను సమర్థిస్తున్నానని సీతారాం అన్నారు.

పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని.. గతంలో అలా జరగకపోవడం తెలంగాణ విడిపోయిందనీ, ఇప్పుడూ అదే తప్పు జరిగితే ఉత్తరాంధ్ర కళింగ ఉద్యమం కూడా రావొచ్చని అన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఇలాంటి ఇబ్బందులు రావని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఉత్తరాంధ్ర భవిష్యత్తు తరం కోసం పోరాడుతున్నామని చెప్పిన ఆయన చంద్రబాబు విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.