Begin typing your search above and press return to search.

ప్రత్తిపాటిపై కొత్త ఆరోపణ

By:  Tupaki Desk   |   12 July 2016 6:50 AM GMT
ప్రత్తిపాటిపై కొత్త ఆరోపణ
X
ఏపీ మంత్రి ప్రత్తిపాటిపై నిత్యం ఏదో ఒక ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అక్షయ గోల్డ్ సంస్థ భూములను మంత్రి భార్య కొన్నారన్న వివాదం కొంత కాలం ఆయన్ను ఇబ్బందుల పాల్జేసింది. తాజాగా ఓ క్రిమినల్ కేసులో మంత్రి బంధువులు ఉన్నారంటూ మాజీ మంత్రి - వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించడం సంచలనం రేపింది. తన సంబంధీకులను ఈ కేసు నుంచి తప్పించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని తమ్మినేని ఆరోపిస్తున్నారు. నకిలీ నాణేల పేరిట మోసం వ్యవహారంలో మంత్రి సంబంధీకులు ఉన్నారని... నకిలీ నాణేల మూలాలు కృష్ణా - గుంటూరు జిల్లాల్లోనే ఉన్నాయని తమ్మినేని అంటున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారమంతా లింగమనేని ఎస్టేట్ కేంద్రంగా జరిగిందని ఆరోపిస్తున్నారు. నకిలీ నాణేల కేసులో 20 నుంచి 30 కోట్ల రూపాయల మేరకు డీల్ జరిగిందని..ఆ శ్రీకాకుళంలో అరెస్టు అయిన నిందితులకు ఆ స్థాయి లేదన్నది తమ్మినేని మాట. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శ్రీకాకుళం జిల్లాలో రహస్యంగా పర్యటించారని.. ఎస్పీతో చర్చలు జరిపారని.. దీనిపై విచారణ చేపట్టాలని తమ్మినేని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, నకిలీనాణేల కేసులో ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఎస్సై - కానిస్టేబుల్ కూడా అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలోనే తమ్మినేని దీనిపై స్పందించారు. దీనివెనుక మంత్రి బంధువు ఒకరున్నారని.. ఆయన పేరు శ్రీనివాసరావని ఆయన అంటున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు బంధువే మహిమ గల నాణెం పేరుతో మోసం చేసిన కేసులో కీలక సూత్రధారని ఆయన చెబుతున్నారు. . ఈ ఏడాది జూన్ 26న శ్రీకాకుళం జిల్లాలో మంత్రి బంధువు శ్రీనివాసరావు... విజయనగరానికి చెందిన దేవుడుబాబుతో ఈ నాణేల విషయంలో 57 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారని తమ్మినేని ఆరోపణల వర్షం కురిపించారు.

మోసపూరిత వ్యాపారాలు చేయడం ప్రత్తిపాటికి కొత్తేమీ కాదని.. కృష్ణమ్మ సాక్షిగా - లింగమనేని ఎస్టేట్స్‌ లో బేరసారాలు జరుగుతూనే ఉంటాయంటూ ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా వివాదంలోకి లాగారు. దేవుడు బాబుకు - శ్రీనివాసరావుకు కుదిరిన డీల్‌ లో డూప్లికేట్ నాణెం అందివ్వడంతో విషయం బయటపడిందన్నారు. అప్పటికే లక్షల రూపాయలు తీసుకున్న దేవుడుబాబు పరారీకాగా శ్రీనివాసరావు మంత్రితో మాట్లాడి డిఐజి - ఎస్పీలకు ఫోన్‌ లు చేయించి వ్యవహారం సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించడం నిజమో కాదో చెప్పాలని ప్రత్తిపాటిని ఆయన ప్రశ్నించారు. ప్రత్తిపాటి సెటిల్మెంట్లు - దందాలు ఎక్కువైపోతున్నాయని తమ్మినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.