Begin typing your search above and press return to search.
పవన్ తో ప్రయాణం కష్టం- కామ్రేడ్లు
By: Tupaki Desk | 9 April 2018 1:55 PM GMTతెలుగు రాష్ర్టాల్లో రాజకీయాలు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం మొడిచేయి చూపడం, తెలంగాణలో అధికార పార్టీకి ధీటుగా ఎదిగేందుకు ప్రతిపక్షాలు పలు యాత్రలు చేపడుతున్న నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో పొలిటికల్ వార్ సాగుతోంది. ఈ క్రమంలో ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా స్పందిస్తున్న జనసేన పార్టీ అధినేత - సినీనటుడు పవన్ కళ్యాణ్ పై కొత్త చర్చ మొదలైంది. ఇటు ఏపీలో అటు తెలంగాణలో జనసేనానితో కలిసి పనిచేసేందుకు వామపక్షాలు ఆసక్తిని చూపుతున్నాయనే చర్చ మొదలైంది. ఏపీలో కలిసి ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో పొత్తు ఖాయమనే జోస్యం వినిపిస్తోంది.
అయితే తెలంగాణలో వామపక్షాలు, జనసేన పార్టీ సంగతి ఏంటనే చర్చ మొదలైంది. గతంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనానితో భేటీ అయిన నేపథ్యంలో ఇక్కడ కూడా పొత్తు పొడుస్తుందనే చర్చ తెరమీదకు వచ్చింది. అయితే దీనిపై తాజాగా తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా పార్టీ జాతీయ నేత బీవీ రాఘవులుతో కలిసి తమ్మినేనితో వివిధ పత్రిక ఛానళ్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...కలిసి వస్తే జనసేనతో కలసి తెలంగాణలో పనిచేస్తామని అన్నారు. అయితే తమకు ఇప్పటివరకు జనసేనాని విధివిధానాలపై ఎలాంటి స్పష్టత లేదని ఈ నేపథ్యంలో తాము ఏ రకంగా ఆయనతో కలిసి సాగుతామని ప్రకటిస్తామని ప్రశ్నించారు. కోదండరాం విధివిధానాలు చెప్తే అప్పుడు కలసి పనిచేయడానికి ఆలోచిస్తామని వివరించారు.
ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ.. తాను, తమ్మినేని కేసీఆర్ ను కలిసామని అయితే రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరగలేదని వివరించారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చ జరిగిందని, మూడవ ఫ్రంట్ సీపీఎం గతంలో పెట్టె ప్రయత్నం చేసి విఫలమయ్యామని, అయితే ఏ ప్రాతిపదికన ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ పెడుతున్నాడో చెప్తే, అప్పుడు ఆలోచన చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ తో సీపీఎంకు పొత్తులు - అవగాహన ఉండదని - బీజేపీని ఓడించడానికి మేము ప్రయత్నం చేస్తాం అంతేనని తెలిపారు.