Begin typing your search above and press return to search.

ఫాంహౌజ్‌లో ప‌డుకుంటే ఎలా?

By:  Tupaki Desk   |   19 April 2016 7:51 AM GMT
ఫాంహౌజ్‌లో ప‌డుకుంటే ఎలా?
X
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్‌ లో పడుకుంటే రాష్ట్రంలో సమస్యలు తీరతాయా అని తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కరువు పర్యటనలో భాగంగా ఆయన వివిధ గ్రామాల్లోని రైతుల‌ను క‌లిసి అనంత‌రం మీడియాతో మాట్లాడారు. కరువు ప్రకటించిన మండలాల్లో ప్రభుత్వం ఎటువంటి సహాయ‌క చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఇక్కడి సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. ప్రతి మండలానికి కరువు సహాయం కింద రూ.10 కోట్లు మంజూరు చేయాలని త‌మ్మినేని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వివిధ కాంట్రాక్టులు పొంది, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ నెల 23న నల్గొండ కలెక్టరేట్ ను ముట్టడించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేసినా రాష్ట్ర సర్కారు స్పందించట్లేదని త‌మ్మినేని మండిప‌డ్డారు. మొక్కుబడిగా ఏదో కొన్ని మండలాలను కరువు ప్రాంతాలు ప్రకటించారని, అక్కడ పైసా సహాయం చేయలేదని విమర్శించారు. అధికారులు - ప్రజాప్రతినిధులెవ్వరూ పల్లెల్లో పంట నష్టాన్ని చూడకపోయినా నివేదికల్ని ఎవర్ని అడిగి పంపారని, నష్టాన్ని ఎలా అంచనా వేశారని నిలదీశారు. ప్రకృతి లోపానికి పాలకులే కారణమన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు శ్రద్ధ చూపకపోవడం వల్లే వర్షాలు పడట్లేదని త‌మ్మినేని ఫైర్ అయ్యారు.