Begin typing your search above and press return to search.
తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక..
By: Tupaki Desk | 11 Jan 2018 1:58 PM GMTతెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త వేదిక ఉద్భవించింది. 28 పార్టీలతో కలసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటైంది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల ఫ్రంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో ప్రజా యుద్ధనౌక గద్దర్ - ప్రొఫెసర్ కంచ ఐలయ్య - సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం - ఇతర రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం 28పార్టీలతో కలిసి పూలే-అంబేద్కర్-మార్క్స్ ఆలోచనల మేళవింపుతో `బహుజన లెఫ్ట్ ఫ్రంట్` ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఫ్రంట్ అధ్యక్షుడుగా నల్లా సూర్య ప్రకాష్ - కన్వీనర్ గా తమ్మినేని వీరభద్రం ఎన్నికయినట్లు తెలిపారు.
కన్వీనర్ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఈనెల 25న హైదరాబాద్ లో 28 పార్టీల ఐక్యవేదిక బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి - ప్రకాష్ అంబేద్కర్ తో పాటు చాలామంది నాయకులు - మేధావులు హాజరవుతారుని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నపార్టీనో - కుర్చీపై ఉన్న ముఖ్యమంత్రినో దించేసి - కొత్త పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తమ వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... ధనికులకు దాసోహమవుతున్న విధానాన్ని మార్చడమే ఈ ఫ్రంట్ లక్ష్యమని తేల్చిచెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ప్రజల కష్టాలు తీరుతాయనుకున్న ఆశలు ఇప్పుడు నీరుగారిపోతున్నాయని...ఇప్పుడున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయ వేదికగానే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటైందని తెలిపారు. రాజకీయాల్లో అన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే బీఎల్ ఎఫ్ లక్ష్యమని ఆయన ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని..ఇప్పుడున్న 28 పార్టీలతో పాటు సీపీఐ - న్యూడెమోక్రసీతో పాటు ఇతర వామపక్ష పార్టీలను కూడా ఈ ఫ్రంట్ లో చేరాలని ఆహ్వానిస్తున్నామన్నారు. వారి చేరికతో బీఎల్ ఎఫ్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నామన్నారు.
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన రాజకీయ నాయకత్వం అధికారంలోకి రావలసి ఉందన్నారు. ఇప్పుడున్న వ్యక్తుల పాలనకన్నా... తమ ఫ్రంట్ అధికారంలోకి వస్తే... మెరుగైన పాలన అందిస్తామని - సామాజిక న్యాయం కోసం తమ ఫ్రంట్ పని చేస్తుందని తెలిపారు