Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు డెడ్ లైన్ పెట్టేశారు

By:  Tupaki Desk   |   29 Dec 2016 7:32 AM GMT
కేసీఆర్‌ కు డెడ్ లైన్ పెట్టేశారు
X
సీపీఎం దిక్కుమాలిన పార్టీ అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. సామాజిక తెలంగాణ - సమగ్రాభివృద్ధి కోసం తాము చేపట్టిన పాదయాత్ర ఆరంభం మాత్రమేనని అన్నారు. మార్చిలో ముగియనున్న పాదయాత్రే కేసీఆర్‌ కు డెడ్‌ లైన్‌ గా త‌మ్మినేని వీర‌భ‌ద్రం ప్రకటించారు. అంతలోగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేయని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందుకోసం వామపక్షాలతోపాటు సామాజిక తెలంగాణ కోరే అన్ని రాజకీయ పార్టీలూ, అన్ని శక్తులూ ఏకతాటిపైకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.మహాజన పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు.

దేశంలోనే నెంబర్ 1 సీఎం గా చెప్పుకుంటున్న కేసీఆర్‌ వాస్తవానికి మాటతప్పడంలో నెంబర్‌-1 అని వీర‌భ‌ద్రం మండిప‌డ్డారు. హామీలు నెరవేర్చకపోయినప్పటికీ మాటల గారడితో పొద్దుపుచ్చే నేర్పు మాత్రం ఆయనకు ఉందని కితాబిచ్చారు. రెండున్నరేళ్లుగా ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితుల్లో కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని వీర‌భ‌ద్రం అన్నారు. ముఖ్యమంత్రి నివాస భవనం నిర్మించుకోవడంతో బంగారు తెలంగాణ సాధ్యం కాదని, 93శాతం ఉన్న సామాన్యుల బతుకులు బాగుపడినప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం తెలంగాణ సెంటిమెంట్‌తోనే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కలే అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆశించిన ఫలితాలు రాకుండా ప్రజలు మరోమారు మోసపోయేందుకు సిద్ధంగా లేరని వీర‌భ‌ద్రం తెలిపారు. అందువల్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గమనించి ప్రజలు మేల్కొనాలని పిలుపు నిచ్చారు. పాదయాత్రలో 4వేల కిలోమీటర్లు తిరగడం లక్ష్యంగా సాగుతున్నామని చెప్పారు. ఇది ఓ రికార్డు కోసం కాదని, సామాజిక తెలంగాణ సాధన కోసం అవసరమైన మార్గాలను ప్రజలకు తెలియజేయడం కోసమని వీర‌భద్రం వివరించారు. ఇప్పటికే 700 గ్రామాల్లో పర్యటించామని, ఎక్కడ చూసినా ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తే ఉందని చెప్పారు. 6వేల పాఠశాలలు మూసివేయడం, పేదప్రజానీకానికి చదువుకునే అవకాశాన్ని దూరం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం డబుల్‌ బెడ్‌ రూం - మూడెకరాల భూమిలాంటి అనేక వాగ్ధానాల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని చెప్పారు. అందువల్ల కలిసికట్టుగా పోరాడితేనే సాధించుకోగలమని అన్నారు. తమకు సంఘీభావం తెలిపిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలాఉండ‌గా....ఒక మహోన్నత లక్ష్యంతో సాగుతున్న మహాజన పాదయాత్రకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కరీంనగర్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ప్రకటించారు. ఈ మేరకు మల్యాల సభలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రిపై చలోక్తులు విసిరారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పట్టించుకోని ముఖ్యమంత్రి రూ.105కోట్లతో రాజభవనం నిర్మించుకున్నారని విమర్శించారు. అందులో రూ.25కోట్ల ఫర్నిచరే ఉందన్నారు. ఈ మేరకు పర్యాటకశాఖ చైర్మన్‌ పేర్వారం రాములుకు ఒక లేఖ రాసినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో దర్శించదగిన పర్యాటక స్థలాల్లో గోల్కొండ, చార్మినార్‌ సహా ముఖ్యమంత్రి నివాసం కూడా చేర్చాలని సూచించారు. అట్టహాసంగా రాచరిక పరిపాలన కొనసాగించాలనే ఉద్దేశమే కేసీఆర్‌లో కనిపిస్తోందిగానీ సామాన్య ప్రజానీకం గోడు పట్టించుకునే పరిస్థితి లేదని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/