Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డపై నిప్పులు చెరిగిన స్పీకర్ తమ్మినేని

By:  Tupaki Desk   |   23 Jan 2021 1:35 PM GMT
నిమ్మగడ్డపై నిప్పులు చెరిగిన స్పీకర్ తమ్మినేని
X
ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తీరుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు. శనివారం మీడియాతో మాట్లాడిన తమ్మినేని ఎవరి రాజకీయ లబ్ధి కోసం నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెడికల్ ఎమెర్జన్సీ ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం కోసం జరుపుతున్నారని మండిపడ్డారు.

మీరు చుట్టూ అద్దాలు బిగించుకొని ప్రెస్ మీట్ పెట్టారని.. రేపు ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికులు వస్తారని.. దీన్ని వల్ల కరోనా సెకండ్ వేవ్ వస్తే ఎవరు బాధ్యులని తమ్మినేని మండిపడ్డారు. ఇటువంటి తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని నిమ్మగడ్డ ప్రశ్నించారు. నిమ్మగడ్డ పట్టుదలకు పోతున్నారని.. ఎందుకంత నియంతృత్వ పోకడ? అంటూ ప్రశ్నించారు..

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి బెదిరింపు ధోరణిలో వెళ్లడం నిమ్మగడ్డకు సబబేనా అని తమ్మినేని ప్రశ్నించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై లేదా అని నిలదీశారు. నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. సీఎస్ అభిప్రాయం కూడా తీసుకోకుండా.. న్యాయస్థానం తీర్పును ఉల్లంఘించలేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు.

ఏపీ ప్రభుత్వం ఫోర్స్ మెజర్ కేసు కింద పరిగణించి రాజ్యాంగం ప్రకారం ఎన్నికలను ఆపాల్సిన అవసరం ఉందని స్పీకర్ సూచించారు. ఎన్జీవోలు ఎన్నికల విధులు బహిష్కరించారని.. పోలీసులు కూడా బహిష్కరిస్తున్నారని.. ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారని తమ్మినేని ప్రశ్నించారు. ఉద్యోగులు, ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటని నిలదీశారు. ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో రెఫరెండం నిర్వహిద్దామని స్పీకర్ తమ్మినేని ఏకంగా నిమ్మగడ్డకు సవాల్ చేశారు.