Begin typing your search above and press return to search.

ఈ చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా వనితా?

By:  Tupaki Desk   |   24 May 2022 7:33 AM GMT
ఈ చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా వనితా?
X
ఆంధ్రప్రదేశ్ లో తానేటి వనితను ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హోం మంత్రిని చేశారో అప్పటి నుంచి ఆమెకు కష్టాలు వదలడం లేదు. మీడియా ఎదుట నోటికొచ్చిందల్లా మాట్లాడి ప్రతిపక్షాలకు, మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. తానేటి వనిత మీద సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, జోక్సు తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించడంతో అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీనిపై మీడియాతో మాట్లాడిన తానేటి వనిత యథాలాపంగా తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. అనంతబాబు తమ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ.. బాధితులగా అండగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. అందుకే చట్ట ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. తప్పు చేసినవారెవరైనా.. తరతమ బేధాలు లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని వెల్లడించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయని.. ఆ కేసును చంద్రబాబు నీరుగార్చారని తానేటి వనిత చెప్పారు. అయితే ఇక్కడే వనిత తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారు.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియని తానేటి వనిత ఈ విషయం గురించి మాట్లాడి మరోమారు అడ్డంగా దొరికేశారు.

ఇటీవల ఒక అత్యాచారం విషయంలోనూ తానేటి వనిత మాట్లాడుతూ తాము దిశ చట్టం తేవడం వల్లే నిందితులకు త్వరగా శిక్షలు పడుతున్నాయని చెప్పారు. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ దిశ బిల్లును మాత్రమే ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ఈ బిల్లు కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియని వనిత దిశ బిల్లునే దిశ చట్టం అనుకుని మాట్లాడేసి అడ్డంగా దొరికిపోయారు.

అలాగే తల్లుల పెంపకం వల్లే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటూ ఇటీవల తానేటి వనిత మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అత్యాచారాలు చేసినవాళ్లను పట్టుకోవడం, శిక్షించడం చేతకాక మాతృమూర్తులను వనిత అవమానిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వనితకు వైఎస్ జగన్ తన మొదటి మంత్రివర్గ విస్తరణలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తానేటి వనితను మహిళా, శిశు సంక్షేమ శాఖల నుంచి తప్పించి హోం శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.