Begin typing your search above and press return to search.
క్షుద్రపూజలకు సిద్ధపడ్డ సీఎం
By: Tupaki Desk | 24 Oct 2015 4:47 PM GMTఉత్కంఠ భరితంగా సాగుతున్న బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనుకుంటున్న ఆ రాష్ర్ట సీఎం నితీశ్ కుమార్ ఇపుడు వివాదంలో చిక్కుకున్నారు. అదికూడా ఆధారాలతో సహా కావడం..మూడో దశ పోలింగ్ కు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడంతో వివాదం ముదిరిపోయింది. బిహార్ లో మూడో దశ పోలింగ్ తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ మాంత్రికుణ్ణి నితీశ్ కుమార్ కలుసుకున్న వీడియో వెలుగులోకి వచ్చి రచ్చ రచ్చగా మారింది.
ఈ వీడియో ప్రకారం ఎన్నికల ప్రచారంలో ఉన్న నితీశ్ కుమార్ స్థానిక నేతతో కలిసి ఓ మాంత్రికుడి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన వద్దకు వెళ్లారు. సదరు బాబా నితీశ్ అభిమాని కావడంతో ఆయన్ను చూడగానే కౌగలించుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో నితీశ్ కు రాజకీయ పాఠాలు చెప్పారు. ఇన్నాళ్లు ప్రత్యర్థిగా ఉన్న, సరైన వ్యక్తిత్వం లేని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో ఎందుకు చేతులు కలిపావని ఆ బాబా నితీశ్ ను నిలదీశారు. పైపెచ్చు తన అభిమానం చాటుకునేందుకు అన్నట్లుగా నితీశ్ జిందాబాద్ కొట్టి....లాలూను డౌన్ డౌన్ అన్నారు. ఈ తతంగం అంతా రికార్డ్ అవడం...సోషల్ మీడియాలో పోస్ట్ అవడంతో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది.
దీనిపై సహజంగానే ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ...మంత్రాలతో ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు. మరో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఈ వీడియోపై స్పందిస్తూ...గతంలో తమ నాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు నితీశ్‌ను దయ్యంపట్టిందని అందుకే ఆయన మంత్రగాళ్ల వద్దకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలను నితీశ్ అభిమానులు తప్పుపట్టారు. వీడియోను అప్‌లోడ్ చేసింది గిరిరాజ్ అయి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే లాలుప్రసాద్ యాదవ్ మరింత భిన్నంగా స్పందించారు. తను ఆ వీడియోను చూడలేదని చెప్పారు. అయితే అలాంటి మంత్రగాళ్ల కంటే తానే పెద్ద మంత్రగాన్నని తేలిగ్గా కొట్టిపారేశారు.