Begin typing your search above and press return to search.

బెజ‌వాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజ‌లు నిజ‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   2 April 2018 4:15 AM GMT
బెజ‌వాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజ‌లు నిజ‌మేన‌ట‌!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన వైనానికి సంబంధించి నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కోట్లాది మంది భ‌క్తుల విశ్వాసానికి ప్ర‌తీక లాంటి బెజ‌వాడ దుర్గ‌మ్మ‌కు త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించిన వైనంపై కొద్ది నెల‌ల క్రితం వీడియో ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌టం.. అదో సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే.

తాంత్రిక పూజ‌లు జ‌ర‌గ‌లేద‌న్న బుకాయింపు పెద్ద ఎత్తున జ‌రిగినా.. విచార‌ణ జ‌రిపిన పోలీసులు మాత్రం దుర్గ‌మ్మ గుడిలో తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించింది నిజ‌మేన‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గ‌త ఏడాది డిసెంబ‌రు 26న దుర్గ‌మ్మ గుడిలో తాంత్రిక పూజ‌లు జ‌రిగిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వారితో పాటు.. కాల్ డేటా ఆధారంగా పోలీసులు అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చార‌ని చెబుతున్నారు. ఇద్ద‌రు ప్రైవేటు పూజారులు ఆమంచి సృజ‌న్.. ఘంట‌సాల పార్థ‌సార‌థి ల‌తో ఈ పూజ‌లు చేయించిన‌ట్లుగా తెలుస్తోంది.

వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప‌లు కోణాల్లో విచారించ‌గా.. షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

డిసెంబ‌రు 26 రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో అమ్మ‌వారి అలంకారం తొల‌గించి పూజ‌లు చేసిన‌ట్లుగా తేలింది. తాంత్రిక పూజ అనంత‌రం అమ్మ‌వారికి మ‌ద్యం.. మాంసంతో విచిత్ర‌మైన నైవేద్యం పెట్ట‌టం.. అక్క‌డ స‌రిగా శుద్ది చేయ‌క‌పోవ‌టంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.

శాంతి రూపిణి అయిన దుర్గ‌మ్మ‌కు ఇలా ఆగ్ర‌హ రూపం తేవ‌టం.. తాంత్రిక పూజ‌లు చేయ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. అయితే.. అదేమీ లేద‌న్న‌ట్లుగా బుకాయింపు జ‌రిగినా.. విచార‌ణలోమాత్రం తాంత్రిక పూజ‌లు జ‌రిగిన‌ట్లుగా తేలింది. దీంతో.. ఆల‌య ఈవో.. ఐఏఎస్ అధికారి సూర్య‌కుమారిపై వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త‌మ చేతికి వ‌చ్చిన నివేదిక‌పై.. ఒక‌ట్రెండు రోజుల్లోనే మ‌రిన్ని చ‌ర్య‌ల్ని ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని చెబుతున్నారు.