Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఎంత స‌న్నిహితుడో చెప్పేసిన కేటీఆర్‌

By:  Tupaki Desk   |   2 Oct 2017 5:35 AM GMT
ఎన్టీఆర్ ఎంత స‌న్నిహితుడో చెప్పేసిన కేటీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస‌క్తిక‌ర‌మైన సంద‌ర్భాన్ని పంచుకోవ‌డం, స‌హాయం చేయ‌డం - స‌ర‌దా సంభాష‌ణ‌లు....ఇలా అన్నింటినీ సోష‌ల్ మీడియా దిగ్గ‌జ‌మైన ట్విట్ట‌ర్ వేదిక‌గానే కానిచ్చేస్తుంటారు. ఈ ఎపిసోడ్‌ లో భాగంగా ఓ నెటిజ‌న్ యువ హీరో నంద‌మూరి తార‌క‌రామారావు ప్ర‌స్తావ‌న‌తో కేటీఆర్‌ ను ఇర‌కాటంలో పెట్టేయాల‌ని ప్ర‌య‌త్నించ‌గా మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో దానికి రిప్లై ఇచ్చారు.

ఎన్టీఆర్ న‌టించిన జైల‌వ‌కుశ సినిమాను ప్ర‌స్తావిస్తూ ఓ నెటిజ‌న్ ``కేటీఆర్ గారు జాగ్ర‌త్త‌. జై(ఎన్టీఆర్‌) వ‌చ్చేస్తున్నాడు`` అంటూ ట్వీట్ చేశాడు. త‌ద్వారా ఎన్టీఆర్ రాజ‌కీయ అరంగేట్రం గురించి పరోక్షంగా ప్ర‌స్తావించారు. దీనికి మంత్రి కేటీఆర్ సైతం అదే రీతిలో చ‌మ‌త్కారంగా స్పందించారు. ``ఇబ్బందేం లేదు మిత్ర‌మా...ఎన్టీఆర్ నాకు వ్య‌క్తిగ‌తంగా నాకు ఆప్తుడైన మిత్రుడు. ఎన్టీఆర్‌ కు `జై`ని జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం తెలుసు`` అంటూ స్పందించి ప‌రోక్షంగా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి స్ప‌ష్ట‌త ఉంద‌ని రిప్లై ఇచ్చారు.

మ‌రోవైపు ఇంకో ట్వీట్‌ లో తెలంగాణ సీఎం కేసీఆర్ అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌ను మంత్రి కేటీఆర్ ప్ర‌స్తావించారు. అనంత‌పురంలో ఏపీ - తెలంగాణ ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్‌ కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికార‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే ప్రాంతాలుగా విడిపోదాం...అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉందామ‌ని తాము వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌కు త‌గు రీతిలో స్పందించార‌ని హర్షం వ్య‌క్తం చేశారు.