Begin typing your search above and press return to search.

తాతకు తారక్‌ నివాళులు.. ఆసక్తికర ఘటన!

By:  Tupaki Desk   |   18 Jan 2023 5:41 AM GMT
తాతకు తారక్‌ నివాళులు.. ఆసక్తికర ఘటన!
X
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ మనుమళ్లు.. జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ తెల్లవారుజామునే హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ కు చేరుకున్నారు. అక్కడ తమ తాత ఎన్టీఆర్‌ కు ఘననివాళులు అర్పించారు.

మరోవైపు ఎన్టీఆర్‌ అక్కడికి వస్తాడని తెలుసుకున్న అతడి అభిమానులు ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాలకు భారీగా చేరుకున్నారు. సీఎం నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఎన్టీఆర్‌ కాస్త ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.

ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటించనున్నారు.

కాగా ఎన్టీఆర్‌ బిడ్డగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని, ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. ప్రజల భవితకు భరోసా ఇచ్చి ఎన్టీఆర్‌ అమ్మగా నిలిచారని కొనియాడారు. ఆడవాళ్లకు అండగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇచ్చి అన్నగా నిలిచారన్నారు. అటువంటి మహానుభావుడిని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం ఎన్టీఆర్‌కే సాధ్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్‌ ఇచ్చిన గొప్ప ఆస్తి అని వెల్లడించారు. బడుగు, బలహీన, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారన్నారు. ఎప్పుడు కూడా ఆయన తలవంచకుండా ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.