Begin typing your search above and press return to search.

టార్గెట్ రఘునందన్: దుబ్బాకకు ప్రభాకర్ రెడ్డి.. మెదక్ ఎంపీగా కవిత?

By:  Tupaki Desk   |   31 Dec 2022 9:30 AM GMT
టార్గెట్ రఘునందన్: దుబ్బాకకు ప్రభాకర్ రెడ్డి.. మెదక్ ఎంపీగా కవిత?
X
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లడం అస్సలు ఇష్టం లేదట.. ఉత్సవ విగ్రహం ఎంపీ పదవి కంటే తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పోరు పెడుతున్నారట.. నిజానికి కొత్త ప్రభాకర్ రెడ్డి 2018 ఎన్నికల వేళ కేసీఆర్ వద్ద ఒకటే పోరుపెట్టారట.. తనకు మెదక్ ఎంపీ సీటు వద్దు.. దుబ్బాక అసెంబ్లీ సీటు ఇవ్వమని.. కానీ అక్కడ సీనియర్ నేత దివంగత రామలింగరెడ్డి ఉండడంతో కేసీఆర్ కు ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా దుబ్బాక టికెట్ ను ఆయనే ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇష్టం లేకున్నా మెదక్ ఎంపీ సీటు నుంచి పోటీచేయించి గెలిపించారు. అయితే దుబ్బాకలో రామలింగారెడ్డి మరణంతో ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బలమైన రఘునందన్ రావు పోటీకి దిగడంతో టీఆర్ఎస్ ఆటలు సాగలేవు. తోడుగా బండి సంజయ్ నాడు చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. దుబ్బాక లో చనిపోయిన రామలింగారెడ్డి భార్యనే బరిలోకి దింపడం కూడా మైనస్ అయ్యింది. నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉండడంతో ఆయన పోటీచేయకపోయారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి బీజేపీ అభ్యర్థి రఘునందన్ చేతిలో ఘోర ఓటమి పాలైంది.

దుబ్బాకలో బీఆర్ఎస్ కు సరైన నేత లేకపోవడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడే తిష్ట వేసి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావుకు, కొత్త ప్రభాకర్ రెడ్డికి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా టికెట్లు దక్కించుకొని దుబ్బాకలో విజయకేతనం ఎగురవేయాలని కొత్త ప్రభాకర్ రెడ్డి ధృడనిశ్చయంతో ఉన్నారు.హరీష్ కు సన్నిహితుడిగా.. ఆర్థికంగా బలంగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక టికెట్ ఇవ్వడానికి ఈసారి కేసీఆర్ పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చని.. ఆయన సూచనలతోనే ప్రభాకర్ రెడ్డి దుబ్బాకపై ఫోకస్ చేసినట్టు సమాచారం.

మరి ప్రభాకర్ దుబ్బాకకు షిఫ్ట్ అయితే ఖాళీ అయ్యే మెదక్ ఎంపీ సీటులో ఎవరిని దించుతారన్నది ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం వస్తోంది. అదే కల్వకుంట్ల కవిత. ఇదివరకే నిజామాబాద్ లో పోటీచేసి నాటకీయ పరిణామాల మధ్య ఓడిపోయిన కవిత రాజకీయంగా దెబ్బతిన్నారు. అందుకే మెదక్ అయితే సేఫ్ అని ఆలోచిస్తున్నారు. ఇక కేసీఆర్ 'గజ్వేల్ ', హరీష్ రావు 'సిద్దిపేట' రెండు నియోజకవర్గాలు ఉంటాయి. సో ఈ రెండింటి మెజారిటీతో ఈజీగా ఎంపీగా గెలవచ్చు. పైగా మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. సో మెదక్ ఎంపీగా కవిత షిఫ్ట్ అయితే రాజకీయంగా మనుగడ ఉంటుందని.. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, బీజేపీ పై పోటీకి దిగడం కంటే ఈ స్థానం సేఫ్ అని ఆలోచిస్తోంది.

ఇదంతా తెలిసే కేసీఆర్ దుబ్బాకకు కొత్త ప్రభాకర్ రెడ్డిని మార్చాడని.. కవిత కోసం మెదక్ ఎంపీ సీటును ఖాళీ చేశారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.