Begin typing your search above and press return to search.

బిట్‌ కాయిన్ పేరుతో రూ.12 కోట్లకు టోపీ

By:  Tupaki Desk   |   25 Aug 2018 8:51 AM GMT
బిట్‌ కాయిన్ పేరుతో రూ.12 కోట్లకు టోపీ
X
బిట్‌ కాయిన్‌...ఈ వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ ఇటీవ‌లి కాలంలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్ర‌చారం ఆధారంగా ఓ ముఠా భారీగా టోపీ పెట్టేసింది. ఎక్క‌డో కాదు.మ‌న హైద‌రాబాద్‌ లోనే! అధిక లాభాలు ఆశచూపెట్టి.. సాఫ్ట్‌ వేర్‌ తో కణికట్టు చేసి 1200 మందిని ముంచి రూ.12 కోట్లు వసూలు చేసింది. ``బిట్‌ కాయిన్ అంటే డిజిటల్ గోల్డ్‌ తో సమానం. మీ పెట్టుబడికి అతి తక్కువ సమయంలో రెట్టింపు లాభాలు ఖాయం. 2030 నాటికి మీరు మిలియనీర్‌ గా మారొచ్చు`` అంటూ ఆ ముఠా అమాయకులను నమ్మించింది. టాస్క్‌ ఫోర్స్ పోలీసులు ఈ ముఠా కార్యాలయంపై దాడి చేసి నిందితులను అరెస్టు చేయడంతోపాటు దాదాపు రూ.1.8 కోట్లు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్‌ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌ రావు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం...కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గర్ధాస్ రమేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 1996లో భూములపై పెట్టుబడి పేరుతో వందలాది మంది వద్ద నుంచి డబ్బు వసూలు చేసి - కంపెనీ బోర్డు తిప్పేశాడు. 1999లో అతడిపై హైదరాబాద్ సీసీఎస్‌ లో కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో అమాయకులను మోసం చేశాడనే ఆరోపణలపై 2013లో బోయిన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా బిట్‌ కాయిన్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి తెరతీశాడు. రమేశ్ తనకు ఒక వెబ్‌ సైట్ తయారు చేసి ఇవ్వాలంటూ ముంబైలోని సీబీ ఆన్‌ లైన్ అనే సాప్ట్‌ వేర్ సంస్థలోని మేనేజర్లు మోహన్ - సునీల్ చౌహాన్‌ ను కోరాడు. దీంతో వారు రమేశ్ ఆమెరికా - ఇంగ్లాండ్ దేశాల అనుమతితో బిట్‌ కాయిన్ వ్యాపారం చేస్తున్నట్టుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ - అమెరికా - లండన్‌ లోని ప్రముఖ వ్యాపార వేత్తల పేర్లను జోడించి ఆకర్షణీయంగా కనిపించేలా కైనెక్స్‌ ట్రేడింగ్.కామ్ పేరుతో వెబ్‌ సైట్ తయారు చేశారు. ఇందులో యూజర్ ఐడీలు - పాస్‌ వర్డ్‌ లు క్రియేట్ చేయడం - ఆ యూజర్ ఎంత పెట్టుబడి పెట్టాడు? ఎంత లాభం వచ్చింది? వంటి వివరాలు కనిపించేలా ప్రోగ్రాం చేసి ఇచ్చారు. ఈ వెబ్‌ సైట్ ఆధారంగా రమేశ్ చైన్ మార్కెటింగ్ పద్ధతిలో బిట్‌ కాయిన్‌ లో పెట్టుబడి పెట్టాలంటూ పలువురిని నమ్మించాడు. ఇందుకు అతడి బామ్మర్ది చందుపట్ల శ్రీనివాస్‌ ను సహాయకుడిగా - సుడాగోని సత్తయ్య - నామళ్ల వెంకటేశ్ - కుంచర్ల హరిగోపాల్‌ ను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఒక్కో సభ్యుడిని చేర్చితే కమీషన్ ఇస్తానని నమ్మించాడు. ఒక సభ్యుడు చేరిన తర్వాత అతడు మరో ఇద్దరిని చేర్పించాల్సి ఉంటుంది. ఇలా ఏజెంట్లు ఎక్కువగా హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాలతోపాటు కరీంనగర్ - రామగుండం - సిద్దిపేట - ఏపీలోని విశాఖపట్నంలో పలువురిని సభ్యులుగా చేర్చారు. చైన్ సిస్టం ప్ర‌కారం చేసిన ఈ కుట్ర పోలీసుల దృష్టికి వ‌చ్చింది.

12 స్కీములు.. పక్కాగా లెక్కలతో ఈ ముఠా ప‌నిచేస్తోంది. బేసిక్ ప్లాన్ కింద 100 డాలర్లు చెల్లిస్తే.. రోజూ 0.4% వడ్డీ - 500 రోజుల్లో రెట్టింపు - 25 వేల డాలర్లు పెడితే రోజూ 7.5 డాలర్లు బోనస్ - 134 రోజుల్లో రెట్టింపు ఇలా మొత్తం 12 రకాల స్కీమ్‌ లు పెట్టారు. భారీగా పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో రెట్టింపు వస్తుందని నమ్మించారు. బాధితుల నుంచి డబ్బు తీసుకొని వారికి యూజర్ ఐడీ - పాస్ వర్డ్ ఇచ్చారు. వారి వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి యూజర్ ఐడీ ఓపెన్ చేయగానే పెట్టుబడి - వడ్డీ వంటి వివరాలు ప్రత్యక్షమయ్యేవి. తర్వాత జమచేసిన డబ్బు సైతం కనిపించేది. కండ్లముందే అంకెలు కనబడుతుండటంతో అందరూ నమ్మేవారు. ఇలా 2016 నుంచి ఇప్పటివరకు 1200 మందికిపైగా సభ్యులను చేర్చుకున్నారు. వారు జమ చేసే డబ్బు రమేశ్ ఖాతాలోకి చేరేది. బోయిన్‌ పల్లిలోని జీఆర్ ఎం ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్నదని సమాచారం రావడంతో నార్త్‌ జోన్ టాస్క్‌ ఫోర్స్ సంస్థపై దాడి చేసింది. దీంతో బిట్‌ కాయిన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిం ది. దీంతో నిర్వాహకుడు రమేశ్ - అతడికి సహకరిస్తున్న సత్తయ్య - వెంకటేశ్ - హరిగోపాల్ - శ్రీనివాస్‌ ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.29.2 లక్షల నగదు - రూ. 1.23 కోట్లు విలువైన స్థల పత్రాలు వంటివి మొత్తంగా రూ.1.8 కోట్లు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.