Begin typing your search above and press return to search.

అప్పుల్లో ఉన్న ఆ సంస్థ‌పై పెద్ద మ‌నుషుల క‌న్ను

By:  Tupaki Desk   |   20 April 2017 5:53 AM GMT
అప్పుల్లో ఉన్న ఆ సంస్థ‌పై పెద్ద మ‌నుషుల క‌న్ను
X
రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సహారా గ్రూపునకు చెందిన ఆస్తులపై కార్పొరేట్లు కన్నేసాయి. టాటా గ్రూపుతోపాటు గోద్రేజ్, అదానీ, పతంజలిలు సైతం సహారా గ్రూపునకు చెందిన 30 ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. వీటి మొత్తం విలువ రూ.7,400 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. సహారా గ్రూపునకు ఉన్న మొత్తం ఆస్తుల్లో ల్యాండ్ బ్యాంక్ అధికంగా ఉంది. వీటిని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వేలం వేయబోతోంది. ఈ భూములను కొనుగోలు చేయడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలైన ఒమెక్స్, ఎల్డికో, హెచ్‌ ఎన్‌ ఐఎస్‌ లతో పాటు ప్రభుత్వరంగ సంస్థయైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా చొరవ చూపిస్తున్నాయి.

హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ హెల్త్‌ కేర్ సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్..లక్నోలో సహారా గ్రూపు నిర్వహిస్తున్న హాస్పిటల్‌ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. సహారా గ్రూపునకు చెందిన ఆస్తులను విక్రయించాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆగమేఘాల మీద విక్రయిస్తే ఆశించిన స్థాయిలో ధర పలికే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ ఆస్తుల విక్రయానికి సంబంధించి మరో రెండు నుంచి మూడు నెలలు గడిస్తేనే అధిక ధర పలికే అవకాశం ఉంటుందని విభిన్న వర్గాలు వెల్లడించాయి. ఈ ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన మరింత సమాచారం ఇవ్వడానికి సహారా గ్రూపు ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. ఏయే కంపెనీల కొనుగోలు చేసే వివరాలను ఆయన వెల్లడించలేదు. పూర్తిస్థాయి వివరాలను త్వరలో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్‌షా గోద్రేజ్ మాట్లాడుతూ..పుణెలో సహారా గ్రూపునకు ఉన్న భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ కొనుగోలు విషయం ప్రాథమిక దశలోనే ఉందన్నారు. ఒమెక్స్ సీఎండీ రోహతాస్ గోయెల్ కూడా ఇదే తరహా సమాధానం వెల్లడించారు. సహారా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనను సంస్థ ముందు పెట్టడం జరిగిందని అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి తెలిపారు. టాటా హౌజింగ్ ప్రతినిధి ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. అలాగే అదానీ గ్రూపు - నైట్‌ ఫ్రాంక్ - పతంజలి గ్రూపునకు చెందిన ఉన్నతాధికారులు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కార్పొరేట్లతోపాటు విద్యా సంస్థలు సైతం ఆసక్తిని ప్రదర్శించాయి. సహారా గ్రూపునకు చెందిన ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన నిధుల్లో తొలి వాయిదా కింద జూన్ 17న రూ.7,400 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది.

లక్ష కోట్ల విలువైన సహారా గ్రూపునకు చెందిన ఆంబీ వ్యాలీ టౌన్‌ షిప్‌ ను వేలం వేయాలని ఈ వారం మొదట్లో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సంస్థ చర్యలను వేగవంతం చేసింది. జూలై-ఆగస్టు 2017లోగా సహారా గ్రూపు రూ.10,500 కోట్ల నిధులను డిపాజిట్ చేయాలనుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టంచేశాయి. అలాగే విదేశాల్లో ఉన్న హోటళ్లను విక్రయించడం ద్వారా రూ.1,500 కోట్లు రావచ్చునని సంస్థ అంచనా వేస్తున్నది. బీహార్‌ లో సహారాకు ఉన్న ఆస్తిపై ఇండియన్ ఆయిల్ కన్నేసింది. సహారాకు చెందిన 14 ఆస్తులను విక్రయించి రూ.5,090 కోట్లు డిపాజిట్ చేయాలని ఫిబ్రవరి 28న కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/