Begin typing your search above and press return to search.

ఐపీవోలు వరుస పెట్టి దెబ్బేస్తున్న వేళ.. సీన్లోకి వస్తున్న దిగ్గజ కంపెనీ

By:  Tupaki Desk   |   12 July 2022 3:28 AM GMT
ఐపీవోలు వరుస పెట్టి దెబ్బేస్తున్న వేళ.. సీన్లోకి వస్తున్న దిగ్గజ కంపెనీ
X
దేశంలో బోలెడన్ని కంపెనీలు ఉన్నా.. మరే కంపెనీకి లేని ప్రత్యేకత.. విలక్షణత టాటా గ్రూపునకు సొంతం. దేశంలో భారతీయ కంపెనీలకు కొదవ లేకున్నా.. ఈ సంస్థ పేరు చెప్పినంతనే ఏదో తెలీని ధీమా.. ఇది మన కంపెనీనే అన్న భావన కలగటానికి కారణం.. ఆ సంస్థ అనుసరించే విలువలే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. పోటీ ప్రపంచంలో పరుగులు తీసే వ్యాపార సంస్థలు.. లాభాల సంగతిని పక్కన పెట్టి.. దశాబ్దాలుగా దేశ ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సందర్భంలోనూ జాగ్రత్తలు తీసుకోవటం ఈ కంపెనీకే చెల్లుతుందన్న మాట పలువురి నోటి నుంచి వస్తుంటుంది.

అలాంటి టాటా గ్రూప్ నకు సంబంధించిన ఒక సంస్థ పబ్లిక్ ఇష్యూకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందన్నది తాజా న్యూస్. కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారిన ఈ అంశం.. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మదుపు చేసే వారికి కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో ఐపీవోలకు వచ్చిన చాలా కంపెనీలు వరుస పెట్టి దెబ్బేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా టాటా తాజా ఐపీవో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశ ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకొని భారీగా మదుపు చేసిన ఎల్ ఐసీ ఐపీవో అలాట్ అయిన వారంతా గగ్గోలు పెట్టేస్తున్న పరిస్థితి. నిజానికి.. ఐపీవో అంటే తెలీనోళ్లు సైతం.. ఎల్ ఐసీ ఐపీవో నేపథ్యంలో దాని గురించి తెలుసుకొని మరీ పెద్ద ఎత్తున డబ్బులు మదుపు చేశారు. దాని ఫలితం అందరికి తెలిసిందే.

ఆ తర్వాత మరికొన్ని ఐపీవోలు వచ్చినా.. వాటి ఫలితాలు ఏవీ ఆశాజనకంగా లేకపోవటంతో.. ఇప్పుడు ఐపీవో అంటే హడలే పరిస్థితి. ఇలాంటివేళ.. టాటా సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ ఒకటి సుదీర్ఘ విరామం తర్వాత ఐపీవోకు వస్తుందన్న సమాచారం బయటకు వచ్చింది.

అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ టాటా గ్రూపు నుంచి రానప్పటికి.. కార్పొరేట్ ప్రపంచంలో మాత్రం దీని గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. టాటా నుంచి వచ్చే ఐపీవోకు మరో ప్రత్యేకత ఉందంటున్నారు. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూ కు వచ్చిన తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీవోకు వస్తున్న సంస్థ ఇదే అవుతుందంటున్నారు.

దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీవోకు వచ్చేందుకు వీలుగా టాటా అనుబంధ సంస్థ పని మొదలు పెట్టిందని.. ఈ ఐపీవో వ్యవహారాలు చూసేందుకు వీలుగా సిటీ గ్రూప్ ను నియమించుకున్నట్లు చెబుతున్నారు. అంతే కాదు.. టాటా గ్రూపులోని మరో అనుబంధ సంస్థ టాటా స్కై సైతం ఐపీవోకు వచ్చేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి టాటా గ్రూప్ ల నుంచి వచ్చే వరుస ఐపీవోలు.. మార్కెట్ కు మరెంత ఊపునిస్తాయో చూడాలి.