Begin typing your search above and press return to search.

కరోనాపై పోరుకు టాటా సాయం రూ.1,500 కోట్లు

By:  Tupaki Desk   |   28 March 2020 2:37 PM GMT
కరోనాపై పోరుకు టాటా సాయం రూ.1,500 కోట్లు
X
టాటా గ్రూపు సంస్థలు దేశ అవసరాలే ప్రామాణికంగా ఎదిగాయి. ఇంకా విడమర్చి చెప్పాలంటే... దేశ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కృషి చేసిన టాటా సంస్థలు దేశంలోనే అగ్రగణ్య కంపెనీలుగా ఎదిగాయని చెప్పాలి. దేశానికి ఏమి కావాలో?... ఏ సమయంలో ఏది అవసరమో... ఎలాంటి సమయంలో ఎలాంటి సేవలు కావాలో టాటాలకు తెలిసినంతగా ఇతరులకు తెలియలేదు. అందుకే దేశ పారిశ్రామిక రంగంలో ఎన్నెన్ని సంస్థలు వచ్చినా... టాప్ పొజిషన్ టాటాలదే. మొత్తంగా దేశ అవసరాలే పరమావధిగా ఎదిగిన టాటా సంస్థలు...ఆపదలో చిక్కుకున్న సమయంలో దేశానికి బాసటగా నిలవాల్సిన కనీస బాధ్యతను కూడా టాటా సంస్థలు మరిచిపోలేదు. అందుకే... కరోనా వైరస్ వలలో చిక్కుకుని దేశం విలవిల్లాడుతున్న కీలక తరుణంలో టాటా ట్రస్ట్ తనవంతుగా రూ.500 కోట్లు - టాటా సన్స్ రూ.1000 కోట్ల మేర భారీ విరాళాన్ని ప్రకటించాయి. మొత్తంగా టాటా గ్రూపులు కరోనాపై పోరు కోసం ఏకంగా రూ.1,500 కోట్ల మేర భారీ విరాళాన్ని ప్రకటించాయి.

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతు పలికిన టాటా ట్రస్ట్ తన వంతు సాయంగా రూ.500 కోట్లను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా ఆ సంస్థ అధినేత రతన్ టాటా శనివారం కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కరోనా కట్టడికి తక్షణ చర్యలు అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని అవసరాలకు అనుగుణంగానే టాటా ట్రస్ట్ - టాటా కంపెనీలు ఎదిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థిితుల్లో కరోనా వైరస్ ను అదుపు చేయడానికి మించిన ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో కరోనాతో పోరాడేందుకు అత్యవసర వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లుగా రతన్ టాటా అభిప్రాయపడ్డారు. అదే సమయంలో టాటా గ్రూపులో ముఖ్యమైన విభాగంగా ఉన్న టాటా సన్స్ తరఫున రూ.1,000 కోట్లను కరోనాపై పోరు కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆ సంస్థ సంచలన ప్రకటన చేసింది.

కరోనాపై పోరు కోసం టాటా ట్రస్ట్ నుంచి ప్రకటించిన రూ.500 కోట్లను ఏఏ అంశాలకు వినియోగిస్తామన్న విషయాన్ని కూడా రతన్ టాటా చాలా విస్పష్టంగానే పేర్కొన్నారు. ఈ నిధులను కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి, రెస్పిరేటరీ సిస్టమ్స్ - టెస్టింగ్ కిట్స్ తయారీ - వైరస్ సోకిన వారికి మాడ్యులర్ చికిత్సా సౌకర్యాల ఏర్పాటు - ఆరోగ్య కార్యకర్తల శిక్షణ.. తదితరాలకు ఈ నిధులను వాడనున్నట్లుగా రతన్ టాటా ప్రకటించారు. అదే సమయంలో టాటా సన్స్ నుంచి కూడా తన వెయ్యి కోట్ల విరాళానికి సంబంధించి ఆసక్తికర ప్రకటన చేసింది. టాటా ట్రస్ట్ ద్వారా కొనసాగనున్న కరోనా కట్టడి చర్యల కోవలోనే తన వెయ్యి కోట్ల నిధులను కూడా ఖర్చు చేయనున్నట్లుగా టాటా సన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా వేళ... ప్రభుత్వానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, కంపెనీలు పెద్ద ఎత్తున సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో టాటా ట్రస్ట్ తో పటు టాటా సన్స్ కూడా ముందుకొచ్చాయి. అయితే టాటా ట్రస్ట్ ప్రకటించిన రూ.500 కోట్లు, టటా సన్స్ ప్రకటించిన రూ.1,000 కోట్లు, మొత్తంగా ఈ రెండు సంస్థలు ప్రకటించిన విరాళమే ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందిన అతి పెద్ద విరాళంగా చెప్పాలి.