Begin typing your search above and press return to search.

ఆ మంత్రి తిండి ఖ‌ర్చు చూస్తే షాకే!

By:  Tupaki Desk   |   14 Jun 2017 6:58 AM GMT
ఆ మంత్రి తిండి ఖ‌ర్చు చూస్తే షాకే!
X
ఒక మ‌నిషి ఎంత తింటాడు? ఒక‌వేళ మాంచి తిండి పుష్టి ఉంటే.. రోజుకు మూడుసార్లు భారీగా లాగించేయొచ్చు. అంత‌కు మించి తిన‌లేరు. ఒక‌వేళ‌.. ఎంత ఖ‌రీదైన తిండి తిన్నా రోజుకు ఐదు వేలకు మించ‌దు. కానీ.. క‌ర్ణాట‌కకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల తిండి ఖ‌ర్చు లెక్క‌లు చూస్తే చుక్క‌లు క‌నిపిస్తాయంతే. గ‌త ఏడాది బెళ‌గావిలో జ‌రిగిన శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులంతా స్టార్ హోట‌ళ్ల‌లో గ‌డ‌ప‌ట‌మే కాదు.. వారి తిండి బిల్లులు చూస్తే ప్ర‌జాధ‌నం అంటే వారికెంత అలుసో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన ప‌ది రోజుల్లో మొత్తంగా స‌భ జ‌రిగింది 55 గంట‌లు మాత్ర‌మే. దీని కోసం అయిన ఖ‌ర్చు మాత్రం కోట్లాది రూపాయిలు కావ‌టం గ‌మ‌నార్హం. అసెంబ్లీ స‌మావేశాల కోసం బెళ‌గావికి వ‌చ్చిన ప్రజాప్ర‌తినిధులు స్థానిక ఫైవ్ స్టార్ హోట‌ల్లో 55 గ‌దులు అద్దెకు తీసుకున్నారు. దీనికే వారు చెల్లించిన మొత్తం రూ.57.99 ల‌క్ష‌లు. ఇక‌.. ఎవ‌రికి వారుగా పెట్టిన తిండి ఖ‌ర్చు సైతం భారీగా ఉంది.

ఫుడ్ బిల్లు విష‌యంలో క‌ర్ణాట‌క న్యాయ‌శాఖా మంత్రి టీబీ జ‌య‌చంద్ర త‌ర్వాతే ఎవ‌రైనా. ప‌ది రోజుల‌కు ఆయ‌న‌ పెట్టిన తిండి ఖ‌ర్చు ఎంతో తెలుసా? ఏకంగా రూ.4,07,033. ఈయ‌న ఒక్క‌రే కాదు.. ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల ఫుడ్ బిల్లు భారీగానే ఉన్నాయి. ప్ర‌తిప‌క్ష నేత కుమార‌స్వామి ఒక రాత్రి భోజ‌నం కోసం రూ.3352 ఖ‌ర్చు చూపిస్తే.. ఐవాన్ డిసౌజా రూ.3105 ను చెల్లించారు. అంద‌రి కంటే త‌క్కువ‌గా బీజేపీ ప‌క్ష నేత జ‌గ‌దీశ్ శెట్ట‌ర్ రూ.50 ఖ‌ర్చుతో చివ‌ర్లో ఉన్నారు.

ఇలా హోట‌ల్ గ‌దుల కోసం.. తిండి కోసం.. ప్ర‌యాణ ఖ‌ర్చుల కోసం భారీగా ఖ‌ర్చు చేశారు. ప‌దిరోజుల అసెంబ్లీ స‌మావేశాల కోసం ప్ర‌జాప్ర‌తినిధులు పెట్టిన ఖ‌ర్చు మొత్తంగా రూ.7.20 కోట్లుగా లెక్క తేల్చారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఆర్టీఐ కార్య‌క‌ర్త బీమ‌ప్ప‌న‌వ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఈ షాకింగ్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌జ‌ల్ని ఉద్ద‌రించేందుకు అసెంబ్లీలో ఏం మాట్లాడ‌తారో తెలిసిందే. ఆ పేరున కోట్లాది రూపాయిల ప్ర‌జా ధ‌నాన్ని ఇంత దారుణంగా ఖ‌ర్చు చేస్తారా? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/