Begin typing your search above and press return to search.

తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చే బ్యాచ్ లోకి కొత్తగా బండి

By:  Tupaki Desk   |   12 Dec 2022 10:30 AM GMT
తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చే బ్యాచ్ లోకి కొత్తగా బండి
X
తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి.. లబ్థి పొందిన వారిలో కేసీఆర్ ముందుంటారు. తెలంగాణ వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. దాన్నో ఆయుధంగా మార్చి.. అదను చూసుకొని రాష్ట్రం ఏర్పాటు చేసేలా కేంద్రం మీద ఒత్తిడి తేవటంలో కేసీఆర్ సక్సెస్ కావటమే కాదు.. దాని ఫలాల్ని వరుస పెట్టి అనుభవిస్తున్న ఆయన రాజభోగం పలు పార్టీల్ని.. వారి అధినేతల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. అధికారాన్ని సొంతం చేసుకోవటానికి దేనికైనా సిద్ధమనే మాటకు మరింత మసాలా జోడిస్తూ.. ప్రాణాలను పణంగా పెట్టటానికి సిద్ధమన్న మాటను ఇట్టే చెప్పేస్తున్నారు.

ఇప్పటికే పలు పార్టీల అధినేత తమ ప్రాణాల్ని తెలంగాణ కోసం ఇచ్చేందుకు సిద్ధం కావటం తెలిసిందే. ఆ జాబితాలో మొదటి వరుసలో తమ పేర్లను ఎప్పుడో నమోదు చేసుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు. వారి తర్వాత ఆ వాదనను బలంగా వినిపిస్తూ తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేందుకు రెఢీ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

అయితే.. ఎవరి అంచనాలకు అందనిరీతిలో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన వైఎస్ షర్మిల.. గడిచిన కొద్దిరోజులుగా తన కార్యకలాపాల్ని వేగవంతంగా చేస్తున్న షర్మిల.. తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాల్ని ఇచ్చేందుకు సైతం సిద్ధమని ప్రకటన చేశారు. మాటలకే పరిమితం కాని ఆమె.. తెలంగాణ ప్రజల సమస్యలు.. కష్టాలు తెలుసుకోవటం కోసం పాదయాత్ర చేపట్టినట్లుగా చెప్పి 3500 కి.మీ. ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల కాలంలో ఆమె పాదయాత్రకు కేసీఆర్ అడ్డు చెప్పటం.. అనుమతి ఇవ్వకపోవటం.. కోర్టుకు వెళ్లిన షర్మిల అనుమతి తెచ్చుకోవటం తెలిసిందే. అయితే.. శాంతిభద్రతల సమస్యను చూపిస్తూ ఆమె పాదయాత్రకు అనుమతి ఇవ్వటం లేదు. దీంతో.. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన షర్మిల.. పట్టుదలకు మారుపేరుగా నిలిచారు.

ఆమె దీక్షను పోలీసులు ఆమెను బలవంతంగా భగ్నం చేస్తూ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తెలంగాణ కోసం అవసరమైతే తన ప్రాణాల్ని విడిచి పెట్టేందుకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. గతంలో టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి సైతం ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు సిద్దమని చెప్పటం తెలిసిందే.

తాజాగా టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇదే వాదనను వినిపిస్తుననారు. తనను ఆరు ముక్కలు చేసినా.. చంపినా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కారు అమలు చేసే వరకు తాను పోరాటం చేస్తానంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రజల కోసం తమ ప్రాణాల్ని ఇట్టే ఇచ్చేందుకు పోటీ పడుతున్న అధినేతలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. తెలంగాణ ప్రజల మనసుల్ని దోచుకోవటానికి వారు చెబుతున్న మాటలకు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.