Begin typing your search above and press return to search.

5,700 కోట్లకు పైగా కుంభకోణం..సుజ‌నా గురించి ఈడీ వివ‌రాలివే

By:  Tupaki Desk   |   24 Nov 2018 5:10 PM GMT
5,700 కోట్లకు పైగా కుంభకోణం..సుజ‌నా గురించి ఈడీ వివ‌రాలివే
X
టీడీపీ రాజ్యసభ ఎంపీ - మాజీ కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి కంపెనీలపై ఈడీ సోదాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుజనాచౌదరి గ్రూప్‌ కంపెనీలు పలుచోట్ల రూ.5,700 కోట్లకు పైగా పలు బ్యాంకులను
మోసగించినట్టు ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వెల్లడించింది. సుజనా గ్రూప్‌ నకు సంబంధిచిన అన్ని కంపెనీలకు తీసుకున్న బ్యాంకు రుణాలు సుజనాచౌదరి వ్యక్తిగత పూచికత్తుపైనే తీసుకున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈనెల 27న తమ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సుజనా చౌదరికి నోటీసులు జారీ చేశారు. ఈడీ విడుదల చేసిన ప్రకటన - ఈడీ ట్విట్టర్‌ అకౌంట్లలో వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..

టీడీపీలో అత్యంత కీలక నేతగా - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ సుజనాచౌదరి మూడు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టినట్టు తాజాగా జరుగుతున్న ఈడీ దర్యాప్తులో తెలుస్తోంది. మొత్తం మూడు బ్యాంకులకు సంబంధించి రూ.364కోట్లు మోసం చేసినట్టు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - ఆంధ్రాబ్యాంక్‌ - కార్పోరేషన్‌ బ్యాంకులు మూడు వేర్వేరు ఫిర్యాదులతో మూడు ఎఫ్ ఐఆర్‌ లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. చెన్నైలో సుజనా చౌదరికి చెందిన బెస్ట్‌ అండ్‌ క్రామ్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ - చెన్నై(బీసీఈపీఎల్‌) రుణాలు తీసుకున్నట్టు బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఈ మేరకు ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌యాక్ట్‌(పీఎంఎల్ ఏ)చట్టాల కింద చెన్నై ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)అధికారులు దర్యాప్తు చేపట్టారు.

బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌ లోని సుజనాచౌదరి నివాసం - కంపెనీల్లో సోదాలు ప్రారంభించారు. ఢిల్లీలోనూ ఒకచోట సోదాలు కొనసాగాయి. శనివారం సైతం సోదాలు కొనసాగాయి. ఇదే కేసులో ఈ ఏడాది అక్టోబర్‌ 8 నిర్వహించిన సోదాల్లో చెన్నై - బెంగళూరు - హైదరాబాద్‌ లో బీసీఈపీఎల్‌ కు చెందిన కీలక అధికారులను విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో శుక్ర - శనివారాల్లోనూ సుజనాచౌదరి ఇల్లు - కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. హైదరాబాద్‌ - పంజాగుట్టలోని నాగార్జున హిల్స్‌ ప్లాట్‌ నంబర్‌-18లో సుజనా చౌదరి నిర్వహిస్తున్న పలు షెల్‌ కంపెనీలకు సంబంధించి 126 రబ్బర్‌ స్టాంప్‌ లను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లోనూ ఈ కంపెనీలన్నీ సుజనాచౌదరి ఛైర్మన్‌ గా - ఆయన ఆదేశాలతోనే కొనసాగుతున్నట్టు గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల అధికారులు - సుజనా చౌదరి తో జరిపిన పరస్పర ఈమెయిల్స్‌ గుర్తించారు.

మ‌రోవైపు అక్టోబర్‌ 8నాటి సోదాల సందర్భంగా బీసీఈపీఎల్‌ డైరెక్టర్లు సైతం ఈ మొత్తం వ్యవహారలు సుజనాచౌదరే చూసుకుంటారని వారు అంగీకరించినట్టు తెలిపారు. బీసీఈపీఎల్‌ కంపెనీ తీసుకున్న బ్యాంకు రుణాలు ఏవిధంగా ఉపయోగించారన్న విషయాలు సైతం తమకు తెలియదని వారు చెప్పినట్టు ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగింపుగా శుక్ర - శనివారాల్లో సుజనా చౌదరి ఇల్లు - కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు ఫైళ్లు - కీలక డాక్యుమెంట్ల ప్రకారం సుజన గ్రూప్‌ కంపెనీలు పలు బ్యాంకులను రూ.5,700కోట్లకు పైగా మోసగించినట్టు గుర్తించామని ఈడీ వెల్లడించింది. సుజనా గ్రూప్‌ కంపెనీలపై ఇప్పటికే డీఆర్ ఐ - ఫెమా - సీబీఐలో మరికొన్ని కేసులు కూడా నమోదై ఉన్నట్టు గుర్తించామని ఈడీ తెలిపింది. సుజనా గ్రూపు ఆధ్వర్యంలో 120పైగా షెల్‌ కంపెనీలు ఉన్నాయని - వీటిలో చాలా కంపెనీలు కేవలం కాగితాల పైనే ఉన్నాయని - మరికొన్ని మనుగడలో లేనివి ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా పలు డమ్మీ కంపెనీల పేరిట రిజిస్ట్రర్‌ చేయబడిన ఆరు అత్యంత ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. వీటిలో ఫెరారీ - రేంజ్‌ రోవర్‌ - బెంజ్‌ తదితర కార్లు ఉన్నట్టు తెలిపింది. వీటన్నింటి ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈనెల 27న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ సోదాల‌పై సుజ‌నా అధికారికంగా స్పందించాల్సి ఉంది.