Begin typing your search above and press return to search.

నందమూరి కుటుంబానికి మూడు టికెట్లు....?

By:  Tupaki Desk   |   14 Dec 2022 2:30 PM GMT
నందమూరి కుటుంబానికి మూడు టికెట్లు....?
X
అన్న గారి కుటుంబానికి ఆంధ్రాలోనే కాదు అమెరికాలోనూ ఎంతో పేరుంది. అభిమాన ధనం ఉంది. నందమూరి అన్న పేరులోనే పవర్ ఉంది. అలనాడు ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెట్టి తొమ్మిది నెలలలో అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన ఎనిమిదేళ్ల పాటు ముమ్మారు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నారు. ఇక చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కాలం సీఎం గా ఉన్న రికార్డుని సొంతం చేసుకున్నారు.

అలాగే విపక్ష నేతగా ఆయనదే రికార్డు. అలా టీడీపీకి పాతికేళ్ళకు పైగా అధ్యక్షుడిగా ఉంటూ తానే సర్వం సహగా ఉంటున్న చంద్రబాబుకు 2024 ఎన్నికలు అతి పెద్ద సవాల్ గా మారాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడం ఆయనకు అనివార్యంగా ఉంది. ఇప్పటికే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడి 23 సీట్లకు పరిమితం అయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటకపోతే పార్టీ ఉంటుంది కానీ ఇబ్బందులు అనూహ్యంగా తరుముకువస్తాయని బాబుకు తెలుసు.

దాంతో ఆయన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడంలేదు. తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నా పొత్తులు అని ఎదురుచూస్తోంది కూడా అందుకే అని అంటున్నారు. అదే విధంగా బీజేపీ టీడీపీతో పొత్తులకు విముఖంగా ఉన్నా సుముఖంగా చేసుకోవడానికి బాబు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఈసారి రాజకీయ గ్లామర్ గా నందమూరి ఫ్యామిలీని రంగంలోకి దించబోతున్నారు అని చెబుతున్నారు. ఎన్టీయార్ కుటుంబం పెద్దది. కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు చాలా మంది ఉన్నారు.

అన్న గారి బ్లడ్ అంటే జనాలకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. అలాగే అమెరికాలో ఉండే ఎన్నారైల నుంచి హైదారాబాద్ లో ఉండే సెటిలర్స్, అదే విధంగా టాలీవుడ్ లో ఉండే సినీ సెలిబ్రిటీస్ కూడా నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం చూపిస్తారు. వారంతా కూడా టీడీపీ అధికారంలోకి రావాలనే కోరుకుంటారు. అదే టైంలో పార్టీకి భూరి విరాళాలు ఇస్తూ పెద్ద ఎత్తున ఫండ్ రైజ్ చేసే టీం లో వీరంతా ఉంటారు. అలాంటి వారికి నందమూరి ఫ్యామిలీ ముందు వరసలో టీడీపీలో కనిపిస్తే రెట్టింపు ఉత్సహాం వస్తుంది.

టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అవసరం అయిన అన్ని రకాలైన అస్త్రాలను, ఆయుధాలను ప్రచార సాధనా సంపత్తిని వారు సమకూర్చి తమ వంతుగా ముందుకు వచ్చి పోరాడుతారు. దాంతో చంద్రబాబు కూడా ఈసారి నందమూరి బ్రాండ్ ని ఫుల్ గా వాడుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీ అంటే బిగ్ షాట్స్ కి ఉండే మోజుని క్రేజ్ ని పూర్తిగా వాడుకోవాలంటే అన్న గారి రక్తాన్ని టీడీపీ రాజకీయాల్లో ముందుంచాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

దీంతో బాబు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీకి ఈసారి మూడు టికెట్లు ఇవ్వాలని బాబు ఒక వినూత్న ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క సీటునూ బాబు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అంతే కాదు ఒక ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని కూడా షరతులు పెడుతున్నారు. గెలుపు గుర్రాలు అని కూడా కచ్చితమైన కండిషన్ తో ముందుకు సాగుతున్నారు. కానీ నందమూరి ఫ్యామిలీ టీడీపీకి ఇపుడు ప్రత్యేకం కాబట్టి ఆ ఫ్యామిలీకి మాత్రం ఒకటి కాదు మూడు టికెట్లు ఇవ్వడానికి బాబు ముందుకు వస్తున్నారు అని అంటున్నారు.

ఇప్పటికే ఎంటీయార్ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలక్రిష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రెండు సార్లు అక్కడ నుంచి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా బాలయ్య కచ్చితంగా గెలుస్తారు అని అన్ని సర్వేలూ చెబుతున్నాయి. దాంతో బాలయ్యకు హిందూపురం టికెట్ కన్ ఫర్మ్. సిట్టింగులందరికీ టికెట్లు అని ఎనాడో ఈ విషయం బాబు చెప్పేశారు. మరి బాలయ్య కాక మరో రెండు టికెట్లు ఏంటి అంటే అందులో ఒకటి నందమూరి వారి మూడవ తరం వారసుడు చైతన్య క్రిష్ణ అని అంటున్నారు.

ఆయన ఎవరో కాదు ఎన్టీయార్ పెద్ద కుమారుడు జయక్రిష్ణ కుమారుడు. ఆయన ఒకటి రెండు సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది. ఆ మధ్యన చంద్రబాబు మీద మాజీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ ని గట్టిగా ఖండించి వార్తల్లోకి చైతన్య క్రిష్ణ ఎక్కారు. ఆయన మామ చంద్రబాబుకు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు. ఆయనకు తన తాత సొంత సీటు అయిన గుడివాడ నుంచి పోటీ చేయాలని ఉంది. ఆ విషయం స్వయంగా ఆయన బాబు వద్దకు వెళ్లి చెప్పి వచ్చారు అని అంటున్నారు. బాబు సైతం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అంటే కొడాలి నాని మీద చైతన్య క్రిష్ణ పోటీ అన్న మాట. అలా నందమూరి ఫ్యామిలీ నుంచి రెండవ సీటును బాబు కన్ ఫర్మ్ చేశారు అని చెబుతున్నారు.

ఇక మూడవ సీటు ఏంటి అంటే అది తారకరత్న సీటు. ఆయన ఎన్టీయార్ మరో కుమారుడు మోహన క్రిష్ణ కుమారుడు. ఆయన చాలా సినిమాల్లో హీరోగా నటించారు. ఇపుడు ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే ఆయన కూడా టీడీపీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. మామ చంద్రబాబు వెంటే తాను అని అంటూంటారు. ఈ మధ్యన అమరావతి రైతులు అమరావతి టూ అరసవెల్లి అంటూ చేసిన పాదయాత్రలో కూడా తారకరత్న కనిపించారు. ఆయన కూడా కొంత దూరం పాదయాత్ర చేపట్టి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారు.

ఆయనకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని ఉంది అని అంటున్నారు. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది తెలియడం లేదు కానీ అమరావతి రాజధాని ప్రాంతం నుంచి అయినా పోటీ చేయవచ్చు, లేకపోతే ఆయన సీమ జిల్లా నుంచి అయినా రంగంలో ఉండవచ్చు అంటున్నారు. ఆయనకు కూడా ఒక టికెట్ ఇచ్చేందుకు బాబు రెడీగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికల్లో మూడు టికెట్లు నందమూరి ఫ్యామిలీకి కన్ ఫర్మ్ అయ్యాయని తెలుగుదేశంలో వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న మాట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.