Begin typing your search above and press return to search.

జేబులో రెండు వేలున్నాయ‌ని అరెస్ట్‌.. ఇదెక్క‌డి ఘోరం అంటోన్న టీడీపీ

By:  Tupaki Desk   |   14 Nov 2021 10:02 AM GMT
జేబులో రెండు వేలున్నాయ‌ని అరెస్ట్‌.. ఇదెక్క‌డి ఘోరం అంటోన్న టీడీపీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాజ‌కీయ కాక రేపుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు న‌గ‌ర పాల‌క సంస్థ‌, కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌లు యుద్ధాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు అధికార పార్టీ వైసీపీ.. ప్ర‌ధాన ప్రాతిప‌క్ష పార్టీ టీడీపీ క‌త్తులు దూసుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకోని ఈ ఎన్నిక‌లో వైసీపీ రెచ్చిపోతుంద‌నే టీడీపీ వాళ్లు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న టీడీపీ మ‌హిళా అభ్య‌ర్థి భ‌ర్త‌ను పోలీసులు అరెస్టు చేయ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నెల్లూరు న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో 4వ డివిజ‌న్ నుంచి టీడీపీ త‌ర‌పున ఓ మ‌హిళా అభ్య‌ర్థి పోటీ చేస్తున్నారు. ఆమె భ‌ర్త మామిడాల మ‌ధును పోలీసులు అర్ధ‌రాత్రి అరెస్టు చేయ‌డంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడిగా మారింది. మ‌ధు జేబులో రూ.2 వేలు ఉన్నాయ‌నే కార‌ణంతోనే ఆయ‌న్ని పోలీసులు అరెస్టు చేశార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అక్ర‌మంగా అరెస్టు చేసి కావాల‌నే బంధిస్తున్నార‌ని పోలీసుల వైఖ‌రిపై టీడీపీ పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. అర్ధ‌రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్లో ఉంచ‌డ‌మేంట‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు మ‌ధు అరెస్ట్ విష‌యం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి న‌వాబుపేట పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్నారు. అర్ధ‌రాత్రి నుంచి అక్క‌డే ఉన్న ఆయ‌న పోలీసుల తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. 4వ డివిజ‌న్‌లో టీడీపీ విజ‌యం ఖాయ‌మైంద‌నే కార‌ణంతోనే వైసీపీ నాయ‌కుల ప్రోద్భ‌లంతోనే పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. మంత్రి అనిల్ చెప్పిన‌ట్లు పోలీసులు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ అధికార వైసీపీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంద‌ని టీడీపీ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే కార‌ణంతో జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌నూ టీడీపీ బ‌హిష్క‌రించిన విష‌యం విదిత‌మే. కాగా ఇప్పుడేమో జేబులో రూ.2 వేలు ఉన్నాయ‌నే కార‌ణంతో అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.