Begin typing your search above and press return to search.

క‌న్నాపై చెప్పుల‌తో దాడి..బీజేపీలో కొత్త సందేహం

By:  Tupaki Desk   |   4 July 2018 4:42 PM GMT
క‌న్నాపై చెప్పుల‌తో దాడి..బీజేపీలో కొత్త సందేహం
X
ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. రాజ‌కీయాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నించేవారు విస్మ‌యానికి గుర‌య్యే ప‌రిణామం జ‌రిగింది. అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై అనుమానాలు క‌లిగేలా...విస్మ‌య‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే...నెల్లూరు జిల్లా కావలి కోర్టు సెంటర్‌ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులతో దాడి జరిగింది. నెల్లూరు జిల్లాలో బీజేపీ పదాధికారుల సమావేశం సంద‌ర్భంగా ఈ అవాంచ‌నీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడింది టీడీపీ కార్యకర్తలుగా గుర్తించిన బీజేపీ కార్యకర్తలు స‌ద‌రు వ్య‌క్తిని చితకబాదారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ కు తరలిస్తున్నా - వెంబడించి మరీ చావబాదారు. ఈ పరిణామం అధికార టీడీపీ - వారి తాజా మాజీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీసింది.

రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కావ‌లికి వెళ్లారు. ఈ ప‌ర్య‌ట‌నలోనే ఆయ‌నపై చెప్పుల దాడి ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీంతో కన్నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీలో గుండా రాజ్యం నడుస్తోందని, బీజేపీపై వరుసగా దాడులు చేస్తున్న టీడీపీ రౌడీరాజ్యాన్ని అడ్డుకుంటామని కమలనాథులు హెచ్చరించారు. ఈ ప‌రిణామంపై బీజేపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ మొన్న గుంటూరు, ఆదోని బీజేపీ కార్యాలయాలపైన, అంత‌కుముందు త‌మ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పైన దాడి చేశార‌ని గుర్తు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని అంతమొందించడానికి రౌడీలు,గూండాలతో దాడులు చేయిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. తన ఇంటిపైకి కూడా టీడీపీ నాయకులు రౌడీలను పంపిస్తున్నారని ఆరోపించారు.

కాగా, రాష్ట్ర వ్యాప్త‌ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పలు ప్రాంతాల్లో ఇలాంటి నిర‌స‌నలు ఎదుర‌వుతున్న క్ర‌మంలోనే...బీజేపీ నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను మంగ‌ళ‌వారం క‌లిసి ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు....ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన , రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. పౌరుల హక్కులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల హక్కులు కాలరాయబడుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీసులు కూడా వైఫల్యం చెందారని, బీజేపీ శ్రేణుల మీద దాడులు జరుగుతుంటే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు కాబ‌ట్టే.. గవర్నర్ కు ఫిర్యాదు చేశామ‌న్నారు. అమిత్ షా మీద దాడి - సోము వీర్రాజు మీద దాడి - కన్నా లక్ష్మీనారాయణ మీద దాడి ప్రభుత్వం పనేన‌ని పేర్కొన్నారు. కాగా, గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసిన మ‌రుస‌టి రోజే...పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిపై చెప్పు దాడి జ‌ర‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది.