Begin typing your search above and press return to search.

అదేంటి.. బాబు నామినేషన్ కోసం విరాళాలా!

By:  Tupaki Desk   |   23 March 2019 6:14 AM GMT
అదేంటి.. బాబు నామినేషన్ కోసం విరాళాలా!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలు చేయడానికి జమ చేయాల్సిన మొత్తం కోసం విరాళాలు సేకరించడం చర్చనీయాంశంగా మారుతోంది. బాబుగారు నామినేషన్ వేయడానికి కట్టాల్సిన డిపాజిట్ రుసుము కోసం విరాళాల సేకరణ జరుగడం వార్తల్లోకి వచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన కార్యకర్తలు ఇందు కోసం హుండీలు పట్టి డబ్బులు సేకరించినట్టుగా తెలుస్తోంది.

ఇది కొత్త ఏమీ కాదని.. ప్రతి సారీ చంద్రబాబు నాయుడు నామినేషన్ కోసం ఇలా విరాళాల సేకరణ జరుగుతూ ఉందని తెలుగుదేశం కార్యకర్తలు చెప్పడం గమనార్హం. ప్రజల నుంచి ఇందు కోసం డబ్బులు అడుగుతున్నట్టుగా, హుండీల్లోకి డబ్బులు వేయించుకుంటున్నట్టుగా వారు చెబుతున్నారు.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరఫున నామినేషన్ దాఖలు అయ్యింది. ఈ సారి కూడా అందుకోసమని డబ్బులు సేకరించారట. అయితే ఇక్కడ ఈ అంశం చర్చనీయాంశంగా మారడానికి వేరే రీజన్లు కూడా ఉన్నాయి.

తాజాగా చంద్రబాబు నాయుడు తన ఆస్తుల ప్రకటన చేశారు. నామినేషన్ తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ లో బాబు ఆస్తుల ప్రకటన చేశారు. దాని ప్రకారం.. బాబు ఆస్తుల విలువ అక్షరాలా ఏడు వందల కోట్ల రూపాయలు! బాబు భార్య పేరిట ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా స్థిర - చరాస్తులు ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడి పేరిట కూడా భారీగా ఆస్తులున్నాయి.

ఇక బాబు కుటుంబీకుల్లో ప్రతి ఒక్కరూ వందల కోట్లకు అధిపతులే. నారా దేవాన్ష్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆ పిల్లాడి పేరిట కూడా కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా కూడా ఇలా విరాళాలు సేకరించడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది.

ఒకవేళ ఎవరైనా పేద రాజకీయ నేత కోసం ఇలా విరాళాలు సేకరించినా అదో ముచ్చట. వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు నామినేషన్ కోసం ఇలా విరాళాలు సేకరించడం మాత్రం ఆశ్చర్యకరమైన అంశం అవుతోంది.