Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ తో టీడీపీ క‌లిసిపోయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   30 Sep 2017 7:34 AM GMT
కాంగ్రెస్‌ తో టీడీపీ క‌లిసిపోయిన‌ట్టేనా?
X
తెలుగు ప్ర‌జల ఆత్మ గౌర‌వాన్ని ఇనుమ‌డింప‌జేయ‌డ‌మే ల‌క్ష్యంగా - తెలుగు జాతిని అవ‌మానానికి గురి చేస్తున్న వ‌ర్గాల‌కు త‌గిన బుద్ధి చెప్పేందుకు తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు - దివంగ‌త నేత నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ... ఆదిలో బాగానే రాణించింది. ఎన్టీఆర్ బ‌తికున్నంత కాలం కూడా టీడీపీని చూసి జాతీయ పార్టీలు సైతం వ‌ణికిపోయాయ‌నే చెప్పాలి. నాడు ఢిల్లీ న‌డివీధుల్లో తెలుగు జాతికి అవ‌మానం జ‌రుగుతోంద‌ని, నాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ వైఖ‌రే ఇందుకు కార‌ణ‌మ‌ని భావించిన ఎన్టీఆర్‌.. నిర్మాణాత్మ‌క‌మైన పోరు సాగించార‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ వ్యూహాల‌తో బెంబేలెత్తిపోయిన ఇందిరా గాంధీ స‌హా నాడు కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేతలుగా ఉన్నవారంతా ఎన్టీఆర్ ను ఎలా నిలువ‌రించ‌గ‌ల‌మ‌న్న కోణంలో చ‌ర్చోప‌చ‌ర్చలు చేశార‌న్న వాద‌న కూడా ఉంది. అయితే వారి వ్యూహాల‌న్నింటినీ బ‌ద్ద‌లు కొట్టేసిన ఎన్టీఆర్‌... తృతీయ ఫ్రంట్ పేరిట ఓ కూటమినే ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాన్ స్టాప్ అధికారానికి గండి కొట్టేశారు. వెర‌సి కాంగ్రెస్ గుండెల్లో ఆయ‌న నిద్ర‌పోయార‌నే చెప్పాలి.

ఇంత‌దాకా బాగానే ఉన్నా.. ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న పార్టీని ఆయ‌న చేతుల్లో నుంచే లాగేసుకున్న ప్ర‌స్తుత పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు.. త‌న‌దైన శైలి అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు తెర తీశార‌నే చెప్పాలి. తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌ తో పోరు బాటనే కొన‌సాగించిన చంద్ర‌బాబు.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోగానే.. త‌న రెండు క‌ళ్ల సిద్ధాంతానికి ప‌దును పెట్టేశార‌నే చెప్పాలి. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ దెబ్బ‌కు సింగిల్ డిజిట్‌ కు ప‌డిపోయిన పార్టీని కాపాడుకునే విష‌యాన్ని బాబు దాదాపుగా ప‌క్క‌న‌పెట్టేశార‌నే చెప్పాలి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన బాబు... ఏకంగా త‌న మ‌కాంను ఉన్న‌ప‌ళంగా విజ‌య‌వాడ‌కు మార్చేసుకున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో టీడీపీ పెద్ద దిక్కు లేనిదిగా మారిపోయింద‌న్న వాద‌న వినిపించింది. ఓటుకు నోటు కేసులో త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

ఈ క్రమంలో తెలంగాణ‌లో పార్టీ మ‌నుగ‌డ దాదాపుగా ప్ర‌శ్నార్థ‌క‌మేన‌ని చెప్పాలి. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఇప్పుడు ప‌లు ఘ‌ట‌న‌లు చోటుచేసుంటున్నాయి. తెలంగాణ‌లో కొడిగ‌ట్టిన టీడీపీ దీపాన్ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి మ‌ళ్లీ వెలిగించేందుకు తీవ్రంగా య‌త్నిస్తున్నార‌న్నట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ దిశ‌గా రేవంత్ చేస్తున్న య‌త్నాలు.. పార్టీకి బ‌ద్ధ శ‌త్రువుగా మారిన కాంగ్రెస్ పార్టీతో స్నేహానికి తెర లేపాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. కేసీఆర్ స‌ర్కారుపై ఒంట‌రిగా పోరాటం చేసే ద‌మ్ము లేని టీడీపీ... త‌న‌కు విరోధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టు క‌ట్టేస్తోంది. కాంగ్రెస్‌ తో టీడీపీ జ‌ట్టు క‌ట్టేస్తోంది అనేకంటే కూడా దాదాపుగా క‌ట్టేసిన‌ట్టేన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే గ‌తంలో జ‌రిగిన ప‌లు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా జ‌ట్టు క‌ట్టిన కాంగ్రెస్‌ - టీడీపీల వ్యూహం నిష్ఫ‌ల‌మే అయ్యింది. తాజాగా సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్‌ తో టీడీపీ జ‌ట్టు క‌ట్టేసింది. మ‌రో వామ‌ప‌క్ష పార్టీ సీపీఐతో క‌లిసి ఈ రెండు పార్టీలు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ ను ఏ మేర‌కు నిలువ‌రిస్తాయో చూడాలి.

ఇందులో భాగంగా నిన్న హైద‌రాబాదులో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి - తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌క్క ప‌క్క‌నే కూర్చుని ద‌ర్శ‌న‌మిచ్చారు. అయితే త‌మ మ‌ధ్య‌లో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట‌రెడ్డిని కూర్చోబెట్టుకున్న వారిద్ద‌రూ... సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఓట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని కాస్తంత ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య మైత్రిపై చాడా వెంక‌టరెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న కాంగ్రెస్‌ - టీడీపీలు క‌లిసిపోయాయి క‌దా.. 2019 ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా మైత్రి క‌నిపిస్తుందా? అన్న మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌కు స్పందించిన చాడా... ప్రస్తుతానికి ఆ రెండు పార్టీలతో పాటు త‌మ పార్టీ కూడా ఓ కూట‌మిగా ఏర్ప‌డ్డాయ‌ని, భ‌విష్య‌త్తు పొత్తుల‌పై స‌మ‌యం వ‌చ్చినప్పుడు చెబుతామ‌ని వ్యాఖ్యానించారు. అంతే త‌ప్పించి... కాంగ్రెస్‌ - టీడీపీల మ‌ధ్య మైత్రి ఉండ‌ద‌ని చాడా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.