Begin typing your search above and press return to search.

పొత్తుల విషయంలో చంద్రబాబుకు తలనొప్పి వారితోనేనా?

By:  Tupaki Desk   |   4 Jun 2022 6:10 AM GMT
పొత్తుల విషయంలో చంద్రబాబుకు తలనొప్పి వారితోనేనా?
X
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మే 27, మే 28 తేదీల్లో మహానాడు నిర్వహించింది. టీడీపీ అంచనాలకు మించి ఈ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీలో జోష్ నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీ జూన్ 4న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పొత్తులు, పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక టీడీపీ, జనసేనలకు ధీటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూలై 8న ప్లీనరీ నిర్వహించనుంది. దీన్ని కూడా రెండు రోజులు నిర్వహిస్తారని సమాచారం.

ఇలా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలతో సమరానికి సిద్ధమవుతున్నాయి. మరోసారి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్తోంది. ఇక టీడీపీ.. బాదుడే బాదుడు పేరుతో జగన్ పాలనలో ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అలాగే జనసేన పార్టీ.. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. రానున్న రోజుల్లోనూ మరిన్ని కార్యక్రమాలతో ఆయా పార్టీలు ప్రజల ముందుకు రానున్నాయి.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే పొత్తు రాజకీయాలకు కూడా తెరలేచింది. ఇప్పటికే జనసేన - బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలోని టీడీపీ కూడా కలసి వచ్చే పార్టీలతో పొత్తుల కోసం చూస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరోమారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతోంది.

కాగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన-బీజేపీ-టీడీపీ కలసి పోటీ చేయాలనేదే పవన్ మాటల్లో అంతరార్థమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేసి ఏపీలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చింది.

ఈ నేపథ్యంలో 2024లోనూ జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు జనసేన, జనసేనతో పొత్తుకు టీడీపీ మొగ్గు చూపుతున్నాయి. కానీ టీడీపీ కార్యకర్తల్లో కమ్మ అతివాదులు, జనసేన పార్టీలో కాపు అతివాదులు ఈ పొత్తుకు ఇష్టపడటం లేదని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో కమ్మలకు, కాపులకు మొదటి నుంచి పడదు. సినిమాల విషయంలో చిరంజీవి, బాలకృష్ణ అంటూ ఎవరి కులం అభిమానులు ఆ హీరోను అభిమానించేవారు. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు వద్దని రెండు కులాల్లోని అతివాదులు అటు చంద్రబాబు నాయుడిపై, ఇటు పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.

మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిననాటి నుంచి కోరుకుంటున్నారు. దీనికి చంద్రబాబు కూడా పాజిటివ్ గానే స్పందించారు. ప్రస్తుతానికి మనది వన్ సైడ్ లవ్ అని, టు సైడ్స్ లవ్ ఉంటేనే పొత్తు సాధ్యమని చెప్పుకొచ్చారు. అయితే రెండు కులాల్లోని అతివాదులు పొత్తుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇందుకు సంబంధించి తమ అయిష్టతను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారని చెబుతున్నారు.

పొత్తు విషయంలో ఆ రెండు కులాల్లో అతివాదుల తీరును తప్పు పట్టలేకపోయినా.. వారు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, కామెంట్లు వివాదాన్ని రాజేసి, పెంచేలా ఉన్నాయని అంటున్నారు. ఇవి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కమ్మ, కాపు కులాల్లోని అతివాదులు తమ తీరు మార్చుకోకపోతే రెండు పార్టీలకు మరోసారి వచ్చే ఎన్నికల్లో భంగపాటు ఎదురుకాక తప్పదని అంటున్నారు. ఈ అతివాదులను ఆయా పార్టీల అధినేతలు అదుపులో పెట్టాలని పేర్కొంటున్నారు. లేకపోతే చేజేతులా తమ పార్టీలకు నష్టం చేసినవారవుతారని ఘంటాపథంగా చెబుతున్నారు.