Begin typing your search above and press return to search.

పీతలతో కన్నీళ్లు పెట్టించిన అంబిక

By:  Tupaki Desk   |   3 April 2019 11:41 AM GMT
పీతలతో కన్నీళ్లు పెట్టించిన అంబిక
X
2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు పీతల సుజాత. దళితురాలైన పీతల సుజాతకు సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే.. ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో.. రెండేళ్ల తర్వాత పదవి నుంచి తప్పించారు. అలా తప్పించినందుకు కూడా బాధపడినా.. ఆ బాధని మాత్రం ఏనాడు బయటకు వ్యక్తం చేయలేదు. మీడియా ముందుకు వచ్చి నానా యాగీ చేయలేదు. 2014 ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి గెలుపొందిన పీతల.. ఈసారి కూడా తనకు టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. కట్‌ చేస్తే.. చంద్రబాబు ఆమెకు టిక్కెట్‌ ఇవ్వలేదు. దీంతో.. ఎప్పటికైనా చంద్రబాబు ఏదో ఒక న్యాయం చేస్తారులే ఉద్దేశంతో సైలెట్‌ అయ్యింది. ఇదే సమయంలో పీతల సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు టీడీపీ స్టార్‌ క్యాంపెయినర్‌ అంబికా కృష్ణ. ముఖ్యమంత్రి నిధులు ఇచ్చినా పొగరు - అహంకారంతో పీతల సుజాత వాటిని ఖర్చు చేయలేదంటూ వివాదాస‍్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే పీతల సుజాతకు ఎమ్మెల్యే టికెట్‌ దక్కలేదని విమర్శించారు. ఓటు వేసిన నియోజకవర్గ ప్రజలకు పని చేయాలనే ఇంగితజ్ఞానం కూడా పీతల సుజాతకు లేదన్నారు.

మంత్రిపదవి పోయినప్పుడు కూడా పెద్దగా బాధపడని పీతల సుజాత.. తనపై అంబికా కృష్ణ చేసిన ఆరోపణలకు మాత్రం కుంగిపోయారు. ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ కన్నీరు పెట్టుకున్నారు. టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకునే అంబికా కృష్ణ పార్టీ అభివృద్ధి గురించి చెప్పకుండా తనని తక్కువ చేసి మాట్లాడతారా? అంటూ వాపోయారు. ఒక దళిత మహిళ పై తప్పుడు ఆరోపణలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. నీలాగా సొంత బామ్మర్ది హోటల్‌ ని తాను ఆక్రమించుకోలేదని అన్నారు. సినీ ఇండస్ట్రీలో మీ వేషాలు అందరికి తెలుసు అంటూ ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.. ఇంకోసారి ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే చెంప చెళ్లుమనిపిస్తా అంటూ పీతల సుజాత సీరియస్‌ అయ్యారు. ఇష్యూ పెద్దది అవుతుందని గమనించిన అంబికా కృష్ణ కాంప్రమైజ్‌ అయ్యారు. సారీ చెల్లెమ్మా అంటూ ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ సారీ చెప్పారు. అనడం ఎందుకు.. సారీ చెప్పడం ఎందుకు అంబికా అంటే అర్థం చేసుకోరూ...