Begin typing your search above and press return to search.

టీడీపీ-బీజేపీ క‌లిసి ముంచేస్తున్నాయి

By:  Tupaki Desk   |   11 Nov 2015 6:30 AM GMT
టీడీపీ-బీజేపీ క‌లిసి ముంచేస్తున్నాయి
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో అభివృద్ధిపై అస్ప‌ష్ట‌త ప్రారంభ‌మైందా? కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని టీడీపీ వ‌ల్ల అమ‌రావ‌తి అభివృద్ధికి ఆటంకాలు ఎదుర‌వుతున్నాయా? ఇందుకు భూముల ధరలు క్రమంగా తగ్గు ముఖం పట్ట‌డ‌మే తార్కాణ‌మా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

రాజధాని అమ‌రావ‌తి శంకుస్థాపన బహిరంగ సభలో మోడీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని, ఆ తర్వాత పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని కొనుగోలుదారులు అంచనాలేశారు. కోట్లు వెచ్చించి రాజ‌ధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. అయితే సీన్ రివ‌ర్స్ అవ‌డం, గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఇపుడు ఒక దశలో ఆకాశాన్నంటిన భూముల ధ‌ర‌లు ఇపుడు నేల‌చూపు చూస్తున్నాయి. ప్ర‌భుత్వం భూస‌మీక‌ర‌ణ‌ ప్రకటించాక తుళ్లూరు మండలంలో ఎకరం రూ.18 లక్షల నుంచి రూ.1.50 కోట్లకు చేరుకుంది. మెట్ట ప్రాంతంలో ఎకరం రూ.1.68 కోట్లకు వెళ్లింది. ఈ ఏడాది జూన్‌ నాటికి కోటి రూపాయలకు తగ్గింది. అమ‌రావ‌తి మాస్టర్‌ ప్లాను వచ్చాక మళ్లీ ధరలు పెరుగుతూ వెళ్లి దాదాపు రూ.1.50 కోట్లకు చేరుకున్నాయి. జరీబు భూములైతే ఎకరం రూ.2 కోట్లు పలికింది. శంకుస్థాపన నాటికి వెంకటపాలెం నుండి రాయపూడి వరకు ఎకరం రూ.2.36 కోట్లకు చేరుకున్నాయి. శంకుస్థాపన జరిగిన ఉద్దండ్రాయునిపాలెంలో ఎకరం రూ.3 కోట్లకు చేరింది. ఈ నెల మొదటి వారం వరకు అదే పరిస్థితి నెలకొంది.

అయితే ప్రస్తుతం సీన్ రివ‌ర్స్ అయింది. మెట్ట ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో ఎకరం రూ.20లక్షలకు తగ్గింది. బేరగాళ్లు అడ్వాన్సులిచ్చి మరీ వెనక్కు తగ్గుతున్న ప‌రిస్థితి ఉంద‌ని స్థానికులు పేర్కొంటున్నారు. శంకుస్థాపన సమయంలో ప్రత్యేక హోదా ప్రకటన రాకపోవడంతో కేంద్రం నుండి నిధులు వస్తాయో రావోననే భయం పట్టుకుంది.

ఇదిలాఉండ‌గా....కొద్దికాలం నుంచి టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ప‌రిణామం రాజ‌ధాని అభివృద్ధిపై ప్ర‌భావం చూపుతుంద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు ధరలు పెరుగుతున్నాయనే పేరుతో గ‌తంలో కొద్ది మంది గ్రూపులుగా ఏర్పడి కొన్నవారు భూములను అమ్మకానికి పెట్టడం కూడా మ‌రో కార‌ణంగా భావిస్తున్నారు.