Begin typing your search above and press return to search.

టీడీపీ-బీజేపీ అస‌లు విష‌యం చెప్ప‌వెందుకు?

By:  Tupaki Desk   |   12 Nov 2015 3:59 PM GMT
టీడీపీ-బీజేపీ అస‌లు విష‌యం చెప్ప‌వెందుకు?
X
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికతో తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం హీటెక్కుతోంది. ప్ర‌చారం ముగించేందుకు స‌రిగ్గా వారం రోజుల గ‌డువు ఉన్న నేప‌థ్యంలో పార్టీల‌న్నీ త‌మ ప్ర‌చార అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీ జాతీయ నేత‌ల‌ను బ‌రిలో దించాల‌ని కాంగ్రెస్ ఇప్ప‌టికే నిర్ణ‌యించగా...మంత్రుల‌తో ప్ర‌చారానికి ఊపు తెచ్చే ప‌నిలో టీఆర్ ఎస్ బిజీబిజీగా ఉంది. ఈ క్ర‌మంలో టీడీపీ-బీజేపీ వ్యూహంపై ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఈ విష‌యంలో ఆ రెండు పార్టీలు క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ...అస‌లు విష‌యాన్ని దాచిపెట్టాయి.

ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా ఐదు బహిరంగ సభలు నిర్వహించాలని తెలుగుదేశం - బీజేపీ నిర్ణయించాయి. ఈ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి దేవయ్యకు తెలుగుదేశం మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి అభ్యర్థిగా దేవయ్యను గెలిపించేందుకు ఇరు పార్టీలూ సమన్వయంతో పని చేయాలని పార్టీనేత‌లు నిర్ణయించారు. ఈ ప్రచారం కోసం బీజేపీ జాతీయ నాయకులు - కేంద్ర మంత్రులు రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌చారంపై మాత్రం అటు బీజేపీ - ఇటు టీడీపీ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఎన్డీఏ అభ్య‌ర్థిగా దేవ‌య్య‌ బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకే బ‌లం ఉంద‌నేది నిజం. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌చారం ఆస‌క్తి ఉంటుంది. అయితే స‌మ‌యం ద‌గ్గ‌రప‌డుతున్నా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై క్లారిటీ రావ‌డంలేదు. ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తుంటే....చంద్ర‌బాబు ప్ర‌చారానికి రాక‌పోవ‌చ్చున‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇంత‌కీ టీడీపీ-బీజేపీలు ఈ విష‌యంలో క్లారిటీ ఎప్పుడిస్తాయో?