Begin typing your search above and press return to search.

ముని కోటి ఇష్యూతో ఎన్ని ప్రకంపనలంటే..?

By:  Tupaki Desk   |   9 Aug 2015 4:54 AM GMT
ముని కోటి ఇష్యూతో ఎన్ని ప్రకంపనలంటే..?
X
ఒక్క ఘటన. ఒకే ఒక్క ఘటన మొత్తం పరిస్థితిని మార్చేయటమే కాదు.. ఇప్పటివరకూ ఉన్న వేసుకున్న వ్యూహాల్ని చెల్లా చెదురు చేయటమే కాదు.. భవిష్యత్తు పట్ల దృష్టి సారించేలా చేసిందన్న భావన కలుగుతోంది.

విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మోడీ సర్కారు స్పందించకపోవటం.. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాలు ఒత్తిడి రాజకీయాలు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పోరు సభను నిర్వహించింది.

ఈ సందర్భంగా సభలో తిరుపతికి చెందిన మునికోటి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకోవటం.. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారటం తెలిసిందే. మునికోటి ఉదంతంలో ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడితే.. ఢిల్లీ అదిరిపడిన పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ఇంతకాలం నానుస్తూ.. ఏదో ఒక ముష్ఠి పడేసి.. చేతులు దులుపుకుందామన్నట్లుగా వ్యూహ రచన చేసిన మోడీ సర్కారు.. ఏపీలో చోటుచేసుకున్న ఘటన ఆందోళనకు గురి చేసింది.

ఇంతకాలం ఏదో ఒక మాట చెప్పేసి బండి లాగించేయొచ్చన్న భావనలో ఉన్న కేంద్ర సర్కారుకు.. మునికోటి ఘటన అనంతరం.. ఏపీ ప్రత్యేక హోదా అంశం ఎంత సీరియస్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెబుతున్నారు. మునికోటి ఉదంతం ఒక్క అధికారపక్షానికే కాదు.. విపక్ష కాంగ్రెస్ ను సైతం తాకింది. మునికోటి ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించి.. అతనికి సంబంధించిన వివరాల్ని తెలుసుకోవటం గమనార్హం.

ఇక.. టర్కీ టూర్ లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రత్యేక హోదా విషయంలో తానెంత ప్రయత్నించినా.. కేంద్రం దగ్గర పప్పులు ఉడకని నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లే.. కామ్ గా ఉంటున్న ఆయనకు.. మునికోటి వ్యవహారం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. తన సొంత జిల్లాకు చెందిన ఒక యువకుడు ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగానికి సైతం సిద్ధం కావటం ఆయన జీర్ణించుకోలేకుండా ఉన్నారని చెబుతున్నారు.

ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా విషయంలో తాము ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాల గురించి మరింత బలంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో ఏ మాత్రం వైఫల్యం చెందినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తమ్ముళ్లను హెచ్చరించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రత్యేక హోదా అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆగస్టు 16 నుంచి 19 లోపు కలుస్తానన్న ప్రకటన చేశారు.

మరోవైపు.. మునికోటి వ్యవహారం అనంతరం.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీహార్ ఎన్నికల అనంతరం.. ఏపీ పర్యటనకు వచ్చి.. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రకటిస్తారన్న వాదన వ్యక్తమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించే విషయంలో ప్రస్తుతం తమకున్న అవరోధాల నేపథ్యంలో.. బీహార్ ఎన్నికలు అయిన వెంటనే.. ఏపీకి ఇచ్చిన వరాన్ని నెరవేరుస్తామన్న మాట.. మునికోటి ఉదంతం తర్వాత బీజేపీ నేతల నోట వినపడటం గమనార్హం.