Begin typing your search above and press return to search.

దుబయిలో ఈ రోజు బీజేపీ, టీడీపీ మంతనాలు ?

By:  Tupaki Desk   |   24 Nov 2019 9:44 AM GMT
దుబయిలో ఈ రోజు బీజేపీ, టీడీపీ మంతనాలు ?
X
ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల్లో అతి పెద్దది ఎన్డీయే నుంచి బయటకొచ్చి బీజేపీపై కత్తులు నూరడమే. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబుకు కూడా ఈ విషయం అర్థమైంది. అందుకే.. ఆయన మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లడం కూడా అందులో భాగమేనని.. వారు అక్కడ చంద్రబాబును బీజేపీ దగ్గరకి చేర్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని సమాచారం. ఆ క్రమంలోనే తాజాగా ఓ అడుగు ముందుకు పడుతోందని దిల్లీ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక దుబాయిలో ఈ రోజు నిర్వహిస్తున్నారు. దీనికి చంద్రబాబు వెళ్లడం లేదని తెలుస్తోంది. అయితే, టీడీపీ - బీజేపీల నుంచి అనేక మంది కీలక నేతలు వెళ్తున్నారు. ఈ కార్యక్రమం దుబాయిలో పెట్టడం వెనుక బీజేపీ - టీడీపీలను దగ్గర చేసే ఆలోచన ఉందని వినిపిస్తోంది. అక్కడ రెండు పార్టీల నేతల మధ్య మంతనాలు జరగబోతున్నాయని వినిపిస్తోంది. చంద్రబాబు ప్రతినిధులు కొందరు నాయకులు బీజేపీ నేతలతో చర్చలు జరుపుతారని చెబుతున్నారు. ఏపీలో కానీ, దిల్లీలో కానీ రెండు పార్టీల నేతలు భేటీ అయితే విషయం బయటకు పొక్కుతుంది కాబట్టి ఈ కార్యక్రమం వేదికగా దుబాయిలో మంతనాలు జరిపితే అక్కడ మన మీడియా సమస్య ఉండదు కాబట్టి విషయం బయటకు రాదన్న అంచనాతో ఈ ఏర్పాటు చేశారంటున్నారు.

కాగా ఇండియా మ్యాపులో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చుతూ మార్పులు చేయడంపై చంద్రబాబు తాజాగా అమిత్ షా - కిషన్ రెడ్డిలపై ప్రశంసలు కురిపించారు. అది కూడా ఈ మంతనాలకు ముందు వార్మప్ వ్యవహారమేనని తెలుస్తోంది. ఇటీవల జమ్ముకశ్మీర్ విభజన తరువాత విడుదల చేసిన కొత్త దేశ పటాల్లో ఏపీ రాజధానిగా అమరావతిని తొలుత చూపించలేదు... తరువాత టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఈ విషయం రైజ్ చేయడంతో పాటు హోం శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి మళ్లీ చేర్చారు. దీనిపై చంద్రబాబు ఎవరూ ఊహించని రీతిలో స్పందించి అమిత్ షా, కిషన్ రెడ్డిలపై ప్రశంసలు కురిపించడం చర్చలకు అనకూల వాతావరణం కల్పించడం కోసమేనంటున్నారు.