Begin typing your search above and press return to search.

బాబును ప‌ట్టుకుంటే 40 సీట్లు.. బీజేపీ ఎత్తుగ‌డ ఇదేనా?

By:  Tupaki Desk   |   19 July 2022 11:30 PM GMT
బాబును ప‌ట్టుకుంటే 40 సీట్లు.. బీజేపీ ఎత్తుగ‌డ ఇదేనా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా బీజేపీ.. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీకి ఎందుకు చేరువైంది? ఎలా చేతులు క‌లిపింది.? అని!.. రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీని క‌లుపుకొనిపోయేందుకు తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పారనే గుస‌గుస ఉంది. ఎట్ట‌కేల‌కు ఆయ‌న కృషి ఫ‌లించింది. స్వ‌యంగా చంద్ర‌బాబు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ముర్ముకు మ‌ద్ద‌తు ప‌లికారు.

అదేస‌మ‌యంలో ఏపీ అధికార పార్టీ కూడా బీజేపీకి అనుకూలంగానే ఓటేసింది. దీంతో ఏపీలో ఇటు అధికా ర పార్టీ.. అటుప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యంలో బీజేపీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఎవ‌రితో చెలిమి చేస్తుంద‌ని చ‌ర్చ‌కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. బీజేపీ నేత‌ల టీడీపీ వ్యూహం వెనుక తెలంగాణ త‌ప్ప మ‌రేమీలేద‌ని పరిశీల‌కులు చెబుతున్నారు. ఏపీలో వైసీపీ-టీడీపీ ఎలా ఉన్నా... రెండు పార్టీల‌తోనూ త‌ట‌స్థ వైఖ‌రినే అవ‌లంభించేలా.. ఢిల్లీ పెద్ద‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది.

అయితే.. తెలంగాణలో మాత్రం.. టీడీపీని అడ్డుపెట్టుకుంటే.. ఆ పార్టీతో చేతులు క‌లిపితే.. త‌మ‌కు 30 నుంచి 40 స్థానాల్లో గెలుపు ఖాయ‌మ‌ని క‌మ‌ల నాథులు అంచ‌నావేస్తున్నార‌ట‌. తెలంగాణ‌లో హైద‌రాబాద్ స‌హా.. ప‌లు జిల్లాల్లో.. టీడీపీ సానుకూల ఓటు బ్యాంకు ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ అంత‌కు ముందు 2014 ఎన్నిక‌ల్లోనూ .. టీడీపీ త‌ర‌పున చాలా మంది గెలుపుగుర్రం ఎక్కారు. ఈ క్ర‌మంలోఇప్పుడు తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని అనుకుంటున్న బీజేపీ.. దీనికి టీడీపీని ద‌న్నుగా చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే కామెంట్లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికీ.. తెలంగాణలో సెటిల‌ర్లు కీల‌క ఓటు బ్యాంకుగా ఉన్నారు. వారంతా కూడా టీడీపీకి సానుభూతి ప‌రులు. పైగా.. అన్న‌గారు ఎన్టీఆర్ అంటే.. అభిమానం. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వారిని త‌మ‌వైపు తిప్పు కునేందుకు ఇప్ప‌టికే అధికార పార్టీ టీఆర్ ఎస్‌, సీఎం కేసీఆర్ కూడా.. త‌ర‌చుగా ఎన్టీఆర్ సెంటిమెంటును ప్ర‌స్తావిస్తుంటారు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన బీజేపీ కీల‌క నాయ‌కుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష లేదా.. ప‌రోక్ష పొత్తు ద్వారా.. టీడీపీతో క‌లిసి ఉంటే.. త‌మ‌కు లాభం చేకూరుతుంద‌ని.. త‌ల‌పోసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే టీడీపీని బీజేపీకి చేరువ చేయ‌డంలో కిష‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగిన‌ట్టు ప్ర‌చారం ఉంది. త‌ద్వారా.. తెలంగాణ‌లో టీడీపీతో క‌లిసి పోటీ చేయ‌డ‌మో.. లేక‌.. టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును సంపాయించుకోవ‌డమో.. చేయొచ్చ‌ని.. బీజేపీ లెక్క‌లు వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే కిష‌న్ రెడ్డి చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌ని.. ఇటు టీడీపీ కూడా.. ఏపీలో త‌న పార్టీ నేత‌ల‌పైనా.. త‌మ కార్యాల‌యాల‌పైనా.. అధికార పార్టీ సాగిస్తున్న ద‌మ‌న కాండ‌కు చెక్ పెట్టాలంటే.. బీజేపీతో చెలిమి చేయ‌క త‌ప్ప‌ద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు ఒకే వేదిక పంచుకున్నాయ‌ని అంటున్నారు.