Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఒక్క‌టైన ముగ్గురు శ‌త్రువులు

By:  Tupaki Desk   |   26 April 2016 9:31 AM GMT
తెలంగాణ‌లో ఒక్క‌టైన ముగ్గురు శ‌త్రువులు
X
పాలేరు ఉప ఎన్నిక వేదికగా తెలంగాణాలో కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు బీజం ప‌డింది. ఇప్పటివ‌ర‌కు కత్తులు దూసుకున్న ప్రధాన రాజ‌కీయ పార్టీలు ఏక‌మయ్యాయి. ఇప్పుడు వీరంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే. అధికార తెరాస‌ను ధీటుగా ఎదుర్కొని ఆ పార్టీ అభ్య‌ర్థి - మంత్రిగా బ‌రిలోకి దిగుతున్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును ఓడించ‌డ‌మే. కేవ‌లం కాంగ్రెస్‌ ను ఢీకొట్టేందుకు - తెలుగువారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో పుట్టిన‌ టీడీపీ ఈ ఎన్నిక‌లో అదే కాంగ్రెస్ అభ్య‌ర్థికి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఇక కేంద్రంలో అదే కాంగ్రెస్ భావ‌జాలానికి విరుద్ధ‌మైన బీజేపీ కూడా ఇక్క‌డ త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీతో క‌లిసి న‌డ‌వ‌క త‌ప్ప‌డం లేదు.

కాంగ్రెస్ అంటే అస్స‌లు ప‌డ‌ని, ఆ పార్టీతో ఎప్పుడూ క‌ల‌లో కూడా పొత్తు అనే మాట ఊహించుకోలేని టీడీపీ - బీజేపీ ఇప్పుడు మాత్రం అదే కాంగ్రెస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. అధికార టిఆర్ ఎస్‌ ను ఢీకొట్టడ‌మే ల‌క్ష్యంగా ప్రధాన విపక్షాల‌న్నీ ఒక్కట‌య్యాయి. మ‌రోవైపు త‌మ సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వామ‌ప‌క్షాలూ చేతులు కలిపాయి. దీంతో పాలేరులో ముక్కోణ పోటీకి రంగం సిద్దమైంది.

పాలేరు ఉప ఎన్నిక సాక్షిగా తెలంగాణ రాజ‌కీయ వేదిక‌పై కొత్త దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఒక‌ప్ప‌టి మిత్రులు - బ‌ద్ధ శ‌త్రువులు కూడా ఒక్క‌ట‌య్యారు. ఇప్పటివ‌ర‌కు ఏ ఎన్నిక‌లోనూ బ‌హిరంగంగా కాంగ్రెస్‌ తో టీడీపీ క‌లిసి న‌డిచిన దాఖ‌లాలు లేవు. ఇక టీఆర్ ఎస్ 2004లో కాంగ్రెస్‌ తో - 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ కూడా త‌న‌కు ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్‌ కు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీతో క‌లిసి న‌డుస్తూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌క తప్ప‌లేదు.

ఇక ఏపీలో అధికార‌ - విప‌క్షంలో ఉన్న టీడీపీ - వైకాపా కూడా ఇక్క‌డ కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. ఇక సీపీఐ మ‌ద్ద‌తుతో సీపీఎం పోటీ చేస్తోంది. ఇక విప‌క్షాల‌న్ని త‌మ‌ను ఓడించేందుకు ఒక్క‌టైనా గులాబి ద‌ళం మాత్రం గెలుపు త‌మ‌దే అన్న ధీమాతో ఉంది. అచ్చంపేట మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా విప‌క్షాల‌న్ని ఒక్క‌టైనా గెలుపు త‌మ‌దే అయ్యింద‌ని...ఇప్పుడు పాలేరులో కూడా త‌మ అభ్య‌ర్థి - మంత్రి తుమ్మ‌ల ఘ‌న‌విజ‌యం సాధిస్తార‌న్న ధీమాతో తెరాస ఉంది. అయితే పాలేరు రిజ‌ల్ట్ తెలంగాణ‌లో 2019 సాధార‌ణ‌ ఎన్నిక‌ల్లో కొత్త పొత్తుల‌కు కూడా బీజం వేస్తుందని రాజ‌కీయ‌ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక పాలేరు ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందో, ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో అనేదే వేచి చూడాలి.