Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌.. అంతా హంబ‌క్!

By:  Tupaki Desk   |   9 Nov 2018 2:30 PM GMT
ఉప ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌.. అంతా హంబ‌క్!
X
ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లో ఉప ఎన్నిక‌లు ముగిశాయి. లోక్‌ స‌భ - శాస‌న‌స‌భ క‌లిసి ఐదు స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రిగితే నాలుగింటిలో అధికార కూట‌మి అయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ లు విజ‌యం సాధించాయి. దీంతో అక్క‌డేదో తెలుగుదేశ‌మే పోటీ చేసి గెలిచిన‌ట్లు తెలుగుదేశం నేత‌లు సంబ‌రాలు చేసుకుంటుంటే... కాంగ్రెస్ వాళ్లు ఇది 2019లో రిపీట్ అవుతుంద‌టూ దేశ వ్యాప్తంగా ఊద‌ర‌గొడుతున్నారు. ఈ విష‌యాన్ని కాస్త త‌ర‌చి చూస్తే ఇద‌స‌లు లెక్క‌లోకి తీసుకోవాల్సిన గెలుపే కాదన్న విష‌యం అర్థ‌మ‌వుతుంది.

రెండు మూడు ద‌శాబ్దాలు వెన‌క్కు వెళ్లినా కూడా ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చిన అధికార పార్టీ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూప‌డం ఒక సంప్ర‌దాయంగా వ‌స్తోంది. దీనికి నంద్యాల ఉప ఎన్నిక‌లు - క‌ర్ణాట‌క ఉప ఎన్నిక‌లు తాజా ఉదాహ‌ర‌ణ‌లు. దీనికి అనేక ఉదాహ‌ర‌ణలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఉప ఎన్నిక‌ల ప్ర‌జ‌ల నాడిని చెప్ప‌వు. అవి అధికార పార్టీ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చిహ్నాలు మాత్ర‌మే.

అధికార పార్టీ ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల‌పై సామ‌ధాన‌బేధ దండోపాయాలు ప్ర‌ద‌ర్శిస్తుంది. డ‌బ్బు కుమ్మురిస్తుంది. అందుకు అన‌ధికారికంగా పో్లీసుల స‌హ‌కారం తీసుకునే ప్ర‌యత్నాలు చేస్తుంది. లోక‌ల్ చోటా నాయ‌కులకు కూడా ఈ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే పార్టీ అధికారంలో ఉంది కాబ‌ట్టి ప్ర‌లోభాలు చూపుతుంది. చిన్నచిన్న కాంట్రాక్టులు - ప‌థ‌కాలతో వారిని ఆక‌ట్టుకుంటుంది. ఇక వంద‌ల‌ కోట్ల‌లో నియోజ‌క‌వ‌ర్గాల‌కు కేటాయింపులు జ‌రుగుతాయి. దీంతో ఇత‌ర పార్టీల కేడ‌ర్ కూడా కొన్ని ప్ర‌లోభాల‌కు అధికార పార్టీకి లొంగుతుంది.

ఇక ప్ర‌జ‌లు కూడా ఆలోచిస్తారు. ఇపుడు ప్ర‌తిప‌క్ష పార్టీ అభ్య‌ర్థిని గెలిపిస్తే ముఖ్య‌మంత్రి త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి ఇక ఏమీ ఇవ్వ‌రు - అభివృద్ధి జ‌ర‌గ‌దు. చూసి చూసి ఎందుకు న‌ష్టం చేసుకోవాలి. వారికి వేస్తే కొత్త‌గా అభివృద్ధి చేయ‌క‌పో్యినా జ‌రిగే అభివృద్ధి అయినా ఆగ‌కుండా ఉంటుందని భావిస్తారు. అందుకే అధికార పార్టీతో పేచి పెట్టుకుని న‌ష్టం చేసుకోవ‌డం కంటే... క‌ళ్లు మూసుకుని గెలిపిద్దాం... జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో బుద్ధి చెబుదాం అనుకుంటారు. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా అధికార పార్టీ అభ్య‌ర్థులు గెలుస్తుంటారు. ఈ మాత్రానికి క‌ర్ణాట‌కలో కాంగ్రెస్ గెలుపును వేడుక చేసుకుంటే ఆ ట్రెండు అన్నిచోట్లా ఉంటుంద‌ని గ్యారంటీ లేదు.